YSRCP lacks policy on capital issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ గందరగోళానికి గురవుతోంది. పార్లమెంట్ లో చట్టం చేయబోతున్న దశలో ఆ పార్టీ అనుకూలమో.. వ్యతిరేకమో ఓ ప్రకటన చేయలేకపోతోంది. ఆ పార్టీ రాయలసీమ నేతలు, ఉత్తరాంద్ర నేతలు మాత్రం అమరావతి రాజధాని అంటే తమ ప్రాంతానికి అన్యాయం చేయడమేనని ప్రకటనలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటారు కానీ.. అనుకూలం అని మాత్రంమ చెప్పరు. ఇది వైసీపీ అధికారిక పాలసీనో కాదో తెలియదు కానీ ఈ అంశంపై ఇలా భిన్నమైన మాటలు మాట్లాడటం మాత్రం ఆ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది

Continues below advertisement

అమరావతికి వ్యతిరేకం కాదు..కానీ అనుకూలం కూడా కాదు!   పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల   జగన్ మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరిగిన అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు మాత్రం భిన్నమైన గళం వినిపిస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయడం తమ ప్రాంతాలకు అన్యాయం చేయడమేనని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా సాగుతున్న ఈ భిన్న స్వరాలు పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతున్నాయా? లేక పార్టీలో నియంత్రణ లోపించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీది అధికారంగా మూడు రాజధానుల పాలసీ - కానీ ఇప్పుడు సైలెంట్ !

Continues below advertisement

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ  మూడు రాజధానుల  మంత్రాన్ని జపించి, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, గతంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. సజ్జల వంటి నేతలు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు కేంద్రాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడకపోవడం ఒక రకమైన  అటూ ఇటూ కాని పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఈ గందరగోళం ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని తగ్గించడమే కాకుండా, పార్టీ విధానపరమైన అస్పష్టతను వేలెత్తి చూపుతోంది.

పార్లమెంట్‌లో అయినా తమ వాదన వినిపిస్తారా?

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బిల్లును వ్యతిరేకిస్తే  అమరావతి ద్రోహి' గా ముద్ర పడుతుందన్న భయం, అనుకూలిస్తే గత ఐదేళ్ల తమ వాదన తప్పని ఒప్పుకున్నట్లు అవుతుందన్న సంకోచం ఆ పార్టీని పీడిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే, ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. లేనిపక్షంలో, ఈ ద్వంద్వ వైఖరి వైసీపీని ప్రజలకు మరింత దూరం చేసే ప్రమాదం ఉంది. 

ప్రజలు ఆశించేది ఒక్కటే.. రాజధాని విషయంలో రాజకీయ ముసుగులు తీసివేసి, వైసీపీ తన అధికారిక పాలసీని ధైర్యంగా ప్రకటించాలి. పార్లమెంట్ సాక్షిగా ఆ పార్టీ ఇచ్చే వివరణే ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని నిర్దేశించనుంది. అస్పష్టమైన మాటలతో కాలం వెళ్లదీయడం కంటే, ప్రజలకు క్లారిటీ ఇవ్వడమే సరైన రాజకీయ వ్యూహం అవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.