China - US Reciprocal Tariff War: అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో క్రిస్మస్‌ (Christmas 2026), నూతన సంవత్సరం (New Year 2027) వేడుకలు అతి పెద్ద పండుగ సీజన్‌. ఈ ఫెస్టివ్‌ సీజన్‌ కోసం, ఏటా, అమెరికా నుంచి చైనాకు బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు వస్తుంటాయి. చైనా వర్తకులు రూపొందించే క్రిస్మస్ చెట్లు. ఇతర అలంకరణ వస్తువులకు అమెరికాలో మంచి గిరాకీ ఉంది, పైగా ధర తక్కువ. సాధారణంగా, ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నాటికి వేల కొద్దీ ఆర్డర్లు ఖరారవుతాయి. అయితే, ట్రంప్‌ టారిఫ్‌ల (Trunp Tariffs) కారణంగా ఈ సంవత్సరం సీన్‌ మారిపోయింది. అమెరికన్ కస్టమర్ల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్‌ కూడా రాలేదని చైనా తయారీదారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇకపైనా ఎటువంటి ఆర్డర్లు రాకపోవచ్చని కూడా భయపడుతున్నారు. జీవనోపాధి కోల్పోతామంటూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ‍‌(US President Donald Trump) చైనా మీద ఏకంగా 125 శాతం దిగుమతి సుంకం (Import Duty) విధించారు. 

చైనా తయారీదారుల్లో భయాందోళనలువార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకం (Reciprocal Tariff) కారణంగా తమకు ఆర్డర్లు రావడం పూర్తిగా ఆగిపోతుందని చైనా తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. "దాదాపు అన్ని అమెరికన్‌ ఆర్డర్లు ఏప్రిల్ నెలలో ఖరారవుతాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్‌ కూడా రాలేదు. యూఎస్‌ కంపెనీల ఆర్డర్లు ఇకపై వస్తాయో, లేదో తెలుసుకోవడం కూడా కష్టంగా మారుతోంది. ఈ సంవత్సరం మా దగ్గర నుంచి అమెరికన్ కస్టమర్లు ఏమీ కొనకపోవచ్చు" అని తూర్పు చైనాలోని జిన్హువాలో క్రిస్మస్ ట్రీ ఫ్యాక్టరీని నడుపుతున్న కున్ యింగ్ రాయిటర్స్‌తో చెప్పారు. క్రిస్మస్‌ చెట్లు, అలంకరణ సామగ్రిని తయారు చేసి యూఎస్‌కు ఎక్స్‌పోర్ట్‌ చేసే దాదాపు ప్రతి చైనా వర్తకుడి మనసులోని ఆందోళనకు ఈ మాటలు అద్దం పడతాయి.

అమెరికన్  మార్కెట్‌ను కోల్పోవడం వల్ల ఉపాధి నష్టం ప్రస్తుత పరిస్థితి చైనా వర్తకులకు మాత్రమే కాదు, అక్కడ పని చేసే లక్షలాది మంది ఉద్యోగులకు కూడా కష్టంగా మారింది. "నేను, నా సహోద్యోగులంతా జీవనోపాధి కోసం అమెరికన్ ఆర్డర్లపై ఆధారపడతాం. మా దేశంలో క్రిస్మస్ అలంకరణకు సంబంధించిన వస్తువులకు డిమాండ్ చాలా తక్కువ. అమెరికన్ మార్కెట్‌ను కోల్పోవడం వల్ల ఖచ్చితంగా చాలా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది" అని జిన్హువాలో నివసించే జెస్సికా గువో చెప్పారు. అమెరికన్‌ ఆర్డర్లు రాకపోవడం వల్ల చైనా ప్రజల జీవనోపాధి ప్రభావితం అవుతోంది.

అమెరికన్ రిటైలర్లు, తాము అమ్మే క్రిస్మస్ చెట్లు & అలంకరణ వస్తువులలో 87 శాతం పైగా ఉత్పత్తులను చైనా నుంచి కొనుగోలు చేస్తారు. ఏటా వీటి విలువ 4 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. చైనా కర్మాగారాలు, తాము ఉత్పత్తి చేసే స్టాక్‌లో దాదాపు సగాన్ని అమెరికా మార్కెట్లలో అమ్ముతాయి. అంటే, ఈ రెండు దేశాల్లోని వ్యాపారులు & వర్తకులు ఒకరిపై మరొకరు ఆధారపడి ఉన్నారు. కానీ ఇప్పుడు, యూఎస్‌ - చైనా వాణిజ్య యుద్ధమేఘాల నీడ వాళ్లపై పడబోతోంది. "ఉరుము ఉరిమి మంగలంపై పడిందన్న" సామెతకు అర్ధం ఇదే. 

అమెరికాకు వచ్చే క్రిస్మస్ అలంకరణ వస్తువుల్లో దాదాపు 5.5 శాతం కంబోడియా నుంచి సరఫరా అవుతాయి. ట్రంప్ ఈ దేశంపైనా సుంకం (10% బేస్‌లైన్‌ టారిఫ్‌) విధించారు.