Chanda Kochhar News: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. రెండున్నర వారాలు జైలు జీవితం రుచి చూసిన తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు నుంచి లభించిన ఉపశమనం తాత్కాలికమే. తన పదవిని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణల మరకలు ఇంకా తొలగి పోలేదు, అంత తర్వగా పోవు కూడా. ఈ ఇద్దరి మీద  CBI విచారణ కొనసాగుతోంది.


ఒకప్పుడు, బిజినెస్‌ స్టుడెంట్స్‌కు, బ్యాంక్‌ ఉద్యోగులకు చందా కొచ్చర్‌ ఒక రోల్‌ మోడల్‌. ఆమె ఏం చేస్తారో తెలీకపోయినా, సాధారణ ప్రజలకు కూడా ఆమె తెలిసేంత పాపులర్‌ అయ్యారు. చందా కొచ్చర్ దేశంలోని అత్యంత శక్తివంతమైన బ్యాంకర్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్. కానీ చందా కొచ్చర్ హయాంలో, ఆ బ్యాంక్ వెనుకబడింది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించడంలో విజయవంతమైంది. ఇది చందా కొచ్చర్‌ కెరీర్‌లో అతి పెద్ద వైఫల్యం.


సింహాసనం నుంచి నేల మీదకు తెచ్చిన దురాశ
అత్యాశే చందా కొచ్చర్‌ను సింహాసనం నుంచి కఠిక నేలపైకి తెచ్చిందని బ్యాంకింగ్‌ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చందా కొచ్చర్‌ మీద 2018లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా వీడియోకాన్ గ్రూప్‌లోని కంపెనీలకు అందిన రుణాల్లో అవకతవకలు జరిగాయని, ఇచ్చిన రుణాలకు బదులుగా లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆమె బ్యాంకు బోర్డు నుంచి అవమానకర రీతిలో తప్పుకోవాల్సి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కు రూ. 3,250 కోట్ల రుణం ఇవ్వడంలో ఆమె పాత్ర మీద ఒక విజిల్‌ బ్లోయర్ నుంచి ఫిర్యాదు అందడంతో, ఐసీఐసీఐ బ్యాంక్ 2018 మే నెలలో విచారణ ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకున్న వీడియోకాన్‌ గ్రూప్‌, చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ నడుపుతున్న ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా వీడియోకాన్‌ గ్రూప్‌ తీసుకున్న రుణం నిరర్ధక ఆస్తిగా మారింది. అంటే.. ఇటు బ్యాంక్‌కు నష్టం, అటు కొచ్చర్‌కు అనుచిత లబ్ధి.. ఇలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం ముదరడంతో, చందా కొచ్చర్ సెలవుపై వెళ్లి ముందస్తు పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు, బ్యాంక్‌ దానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత ఆమెను బ్యాంక్‌ ఉద్యోగం నుంచి తొలగించింది.


1984లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా మొదలైన ప్రయాణం
చందా కొచ్చర్ 1984లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఐసీఐసీఐలో కెరీర్‌ ప్రారంభించారు. అప్పటి గ్రూప్ ఛైర్మన్ కె.వి.కామత్‌కి ఆమె అంటే చాలా ఇష్టం. 1990ల ప్రారంభంలో వాణిజ్య బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్‌ మారింది. 2009లో MD & చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా KV కామత్ తర్వాత ఆమె ఎంపికయ్యారు. 


రూ.3 కోట్ల జీతం తీసుకున్నా..!
ఐసీఐసీఐ బ్యాంక్‌ని విడిచి పెట్టే ముందు చందా కొచ్చర్ జీతం నెలకు రూ. 26 లక్షలు. ఏడాదికి రూ. 3.12 కోట్లు. బ్యాంకింగ్ రంగంలో ఆదిత్య పూరి, అమితాబ్ చౌదరి, ఉదయ్ కోటక్ తర్వాత అత్యధిక జీతం అందుకున్న వ్యక్తి చందా కొచ్చర్. బ్యాంకింగ్‌ రంగంలో ఒక ధృవతారగా వెలిగి, ఇప్పుడు అవమానాల చీకట్లో ఆమె మగ్గిపోతున్నారు.