Chanda Kochar Case Update: ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మాజీ ఎండీ & సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు కోర్టులో చుక్కెదురైంది. బాంబే హై కోర్టులో (Bombay High Court) వాళ్లకు ఊరట దక్కలేదు.
తమను సీబీఐ (Central Bureau of Investigation -CBI) అరెస్టు చేయడం చట్ట విరుద్ధమంటూ, అత్యవసర విచారణ కోసం భార్యభర్తలిద్దరూ కోర్టుకు ఎక్కారు. తమ అరెస్ట్‌ను బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతోపాటు... తమను మూడు రోజుల సీబీఐ కస్టడీకి ముంబై కోర్టు ఇవ్వడం తగదంటూ, ఆ విషయాన్ని కూడా తమ పిటిషన్ పేర్కొన్నారు. అయితే... ఆ పిటిషన్‌ను విచారించేందుకు బాంబే హై కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని వెకేషన్ కోర్టు తెలిపింది. సెలవులు ముగిసిన తర్వాత రెగ్యులర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయాలని చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్తకు న్యాయస్థానం సూచించింది. రెగ్యులర్ విచారణ కోసం జనవరి 2 తర్వాత ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించ వచ్చని ఆ దంపతులకు చెప్పింది. ప్రస్తుతం వీరిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది.
వీడియోకాన్ గ్రూప్‌నకు (Videocon Group) రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద చందా కొచ్చర్ (Chanda Kochhar), ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను (Deepak Kochhar) సీబీఐ గత శుక్రవారం అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద ఎలాంటి అనుమతి లేకుండానే తమను అరెస్టు చేశారని చందా కొచ్చర్, ఆమె భర్త బాంబే హై కోర్టుకు తెలిపారు. రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని తమ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కూడా చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం బాంబే హై కోర్ట్‌కు సెలవులు. అత్యవసర విచారణల కోసం వెకేషన్ బెంచ్ ఉంది. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల కేసు ఈ బెంచ్ ముందుకు వచ్చింది. హై కోర్ట్ సెలవుల్లో ఉంది కాబట్టి, విచారణ కోసం తొందర పడొద్దని పిటిషనర్లకు వెకేషన్ బెంచ్ సూచించింది. రెగ్యులర్ బెంచ్‌లో విచారణ కోసం జనవరి 2 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
వీడియోకాన్ యజమాని వేణుగోపాల్ ధూత్‌ను (Venugopal Dhoot) కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రుణం మంజూరు చేసినందుకు చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు లంచం ఇచ్చిన ఆరోపణలపై వేణుగోపాల్ ధూత్ అరెస్ట్ అయ్యాడు. వీడియోకాన్ గ్రూప్‌నకు లోన్ల జారీలో చందా కొచ్చర్ అనుచిత లబ్ధి పొందారన్న విషయం బయట పడడంతో, ఐసీఐసీఐ బ్యాంక్ CEO పదవి నుంచి 2018లో ఆమె వైదొలగవలసి వచ్చింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate - ED) కూడా ఈ కేసును విచారణ చేస్తోంది. రూ. 7862 కోట్ల విలువైన 24 రుణాల మంజూరు కేసులను ఈడీ తవ్వుతోంది. చందా కొచ్చర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంకు, 2009 నుంచి 2018 మధ్యకాలంలో వీడియోకాన్‌కు అక్రమంగా ఈ రుణాలన్నీ ఇచ్చినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.