AP CM Jagan: ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా డబ్బులు పొందని వారికి సీఎం జగన్ మరో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తగా ఉన్న 2.79,065 మందికి రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చామని చెప్పారు. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఏపీలో ఇచ్చినట్లుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు.






"లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం." - ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి










అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎవరికైనా ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందకపోతే వారి వివరాలు సేరించి తిరిగి సంక్షేమ ఫలాలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందనివారు నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే..వెరిఫై చేయించి అర్హులైన వారికి డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాల మొత్తాన్ని జూన్‌ నెలలో, జూన్‌ నుంచి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్‌ నెలలో జమ చేస్తోంది వైసీపీ సర్కార్. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్ధిష్ట సమయంలోనే బటన్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు.






పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకోకసారి ఆడిట్‌ జరగాలన్నారు సీఎం జగన్. ఆడిట్‌ జరుగుతుంటేనే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే తమ లక్ష్యమని... మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న జగన్... తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని.. గట్టిగా తిట్టాలన్నారు.


గత ప్రభుత్వంలో పెన్షన్‌ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఉంటే... ఇప్పుడు నెలనెలా పెన్షన్‌ బిల్లు రూ.1770 కోట్లకు పెరిగిందన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని... ఇప్పుడు అది 62 లక్షలకు పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు అందరం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని... విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు.