Maternity Scheme For Women: డెలివెరీ కోసం ఆసుపత్రికి వెళితే జేబుకు చిల్లు పెట్టే బిల్లు కట్టడం గురించే మనందరికీ తెలుసు. కానీ, రివర్స్‌లో డబ్బు తీసుకోవడం గురించి తెలుసా?. దేశవ్యాప్తంగా ఈ విధానం ఇప్పుడు అమలవుతోంది.


డెలివెరీ కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, లేదా ఇంట్లోనే మంత్రిసాని చేత పురుడు పోయించుకుంటారు. ఇంట్లో జరిగే కాన్పు తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం. ఇంట్లో జరిగే ఈ ప్రమాదకర ప్రక్రియను నివారించి, ఆసుపత్రిలో సురక్షితంగా కాన్పు జరిగేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం "జనని సురక్ష యోజన" (JSY). జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, డెలివరీకి ముందు & తర్వాత ప్రయోజనాలు పేద స్త్రీలకు అందుతాయి. మాతాశిశు మరణాలను తగ్గించడం ఈ పథకం లక్ష్యం. స్థానిక ఆశా (ASHA) కార్యకర్తల ఆధ్వర్యంలో జనని సురక్ష యోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు.


ఆసుపత్రుల్లో తక్కువ పురుళ్లు జరుగుతున్న రాష్ట్రాలను లో పెర్ఫార్మింగ్ స్టేట్స్‌గా (LPS), మిగిలిన రాష్ట్రాలను హై పెర్ఫార్మింగ్ స్టేట్స్‌గా (HPS) కేంద్రం విభజించింది. LPS లేదా HPSను బట్టి క్యాష్‌ రివార్డ్‌ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండూ HPS కిందకు వస్తాయి. 


జనని సురక్ష యోజన అర్హతలు:


LPS విభాగం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా & రాష్ట్ర ఆసుపత్రుల్లో డెలివెరీ అయిన మహిళలు


HPS విభాగం: అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డెలివెరీ అయిన పేద (BPL) మహిళలు, SC/ST మహిళలు


LPS & HPS విభాగం: 'గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో' డెలివెరీ అయిన BPL/SC/ST స్త్రీలు


ఎంత క్యాష్‌ ఇస్తారు?


జనని సురక్ష యోజన కింద గర్భిణి స్త్రీలకు ఇచ్చే డబ్బును రెండు ప్యాకేజీలుగా (మదర్స్ ప్యాకేజీ & ఆశా ప్యాకేజీ) విభజించారు. మదర్‌ ప్యాకేజీ డబ్బును గర్భిణి స్త్రీలకు, ఆశా ప్యాకేజీ డబ్బును ఆశా కార్యకర్తకు అందిస్తారు. ఈ ప్యాకేజీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి.


LPS విభాగంలోని గ్రామీణ ప్రాంతాల్లో... మదర్‌ ప్యాకేజీ కింద 1,400 రూపాయలు తల్లికి అందుతాయి. ఆశా కార్యకర్తకు 600 రూపాయలు ఇస్తారు. HPS విభాగంలోని గ్రామీణ ప్రాంతాల్లో... మదర్స్ ప్యాకేజీ కింద రూ.700, ఆశా ప్యాకేజీ కింద రూ.600 దక్కుతాయి.


LPS విభాగంలోని పట్టణ ప్రాంతాల్లో... మదర్‌ ప్యాకేజీ కింద 1,000 రూపాయలు జననికి చెల్లిస్తారు. ఆశా కార్యకర్తకు 400 రూపాయల బహుమతి అందజేస్తారు. HPS విభాగంలోని పట్టణ ప్రాంతాల్లో... మదర్స్ ప్యాకేజీ కింద రూ.600, ఆశా ప్యాకేజీ కింద రూ.400 ఇస్తారు.


డెలివరీ కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే గర్భిణీ స్త్రీకి మొత్తం నగదును ఒకేసారి ఇస్తారు. ఒకవేళ, ప్రసవానంతర సంరక్షణ కోసం 'గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రి'కి వెళ్తే.. ఆ మహిళకు 75% నగదును ఒకేసారి చెల్లిస్తారు. 


మరో ఆసక్తికర కథనం: ఉద్యోగాలు ఎక్కువ, నిరుద్యోగులు తక్కువ - ఇండియాలోనే ఉన్నామా?