Central Consumer Protection Authority :అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయడం అంటే దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.
పైన పేర్కొన్న ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో పాకిస్తానీ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ ముద్ర ఉన్న వస్తువుల అమ్మకాలు సాగించాయి. దీనిపై వివిధ వర్గాల నుంచి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై రియాక్ట్ అయిన సీసీపీఏ చర్యలకు శ్రీకారం చుట్టింది. ముందుగా అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ , ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఇలాంటి అమ్మకాలు చేయడం అంటే సెన్సిటివిటీ లేకుండా దేశ మనోభావాలను ఉల్లంఘించడమేనని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం తెలిపారు. అటువంటి వాటిని వెంటనే తొలగించాలని ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించినట్లు జోషీ వెల్లడించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన "ఇటువంటి సెన్సిటివ్ విషయాలపై సీరియస్‌గా ఉంటాం, అందరిలో అది ఉండాలని" అని వార్నింగ్ ఇచ్చారు.
"పాకిస్తానీ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ , ది ఫ్లాగ్ కార్పొరేషన్‌కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. అటువంటి సున్నితమైన అంశాలను పట్టించుకోకుంటే సహించబోము. అటువంటి కంటెంట్ మొత్తాన్ని వెంటనే తొలగించి జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు ఇచ్చాం" అని కేంద్ర మంత్రి జోషి అన్నారు.
దేశంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు గమనించి వ్యాపారుల చేసుకోవాలని అన్ని ఆన్‌లైన్ రిటైలర్లకు హెచ్చరించారు. భారతీయ చట్టాలను గౌరవించాలని ఆదేశించారు. ఇవి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడమే కాకుండా వాటిని జనాలందరికీ కనిపించేలా ఫ్లాగ్ చేసి పెట్టడంపై కూడా కేంద్రం మండిపడింది. ఇలా ప్లాగ్ చేయడం వల్ల ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట పాకిస్థాన్ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ చిహ్నాలు కలిగి ఉన్న వస్తువులే కనిపిస్తాయి. వాటిని కొనాలంటు ఆయా ప్లాట్‌ఫామ్‌లు రికమెండ్ చేసినట్టు ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. అన్నింటిని చూసిన కేంద్రం వారికి నోటీసులు జారీ చేసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలను కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొది. ఇంతలో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇ- కామర్స్ సైట్ చేసిన చర్యలపై ఆగ్రహం పెల్లుబికింది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మంగళవారం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్ రాశారు. పాకిస్తాన్ జాతీయ చిహ్నాలను కలిగి ఉన్న వస్తువుల ఆన్‌లైన్ అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది.
ఇది దేశ ప్రజలన కలవరపరిచే వ్యవహారంగా ఆ సంస్థ పేర్కొంది. దేశం కోసం సరిహద్దుల్లో భారత సైన్యం తమ ప్రాణాలు అర్పిస్తుంటే దేశంలో పాకిస్థాన్ జెండాలు అమ్మకాలు చేయడమేంటని ప్రశ్నించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనికుల త్యాగాలకు అవమానంగా పేర్కొంది. దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని CAIT అధ్యక్షుడు B.C. భార్టియా కేంద్రమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.