CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!

ABP Desam   |  Murali Krishna   |  10 Jan 2022 07:00 PM (IST)

7 వేల కోట్ల అప్పులను తీరుస్తూ.. కేఫ్ కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్నిర్మిస్తున్నారు మాళవిక హెగ్దే. అసలు ఇదెలా సాధ్యమైంది?

భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!

2019 జులై.. కాఫీ కింగ్‌గా పేరొందిన సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం వేల కోట్ల అప్పు. అదీ అక్షరాల రూ.7 వేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి తెరమీదకొచ్చారు ఆయన భార్య మాళవిక హెగ్దే. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు.

కాలం గిర్రున తిరిగింది. అందరి అంచనాలను పటాపంచాలు చేస్తూ.. కంపెనీ అప్పులు సగానికి (రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లకు) మాళవిక తగ్గించేశారు. ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. కేఫ్ కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. తన భర్త సిద్దార్థ్ విధికి తలవంచితే. మాళవిక విధికి ఎదిరించి నిలబడ్డారు. అసలిది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు ఆమె తాజా ఇంటర్వ్యూలో చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారు.

అదే ఊపిరి..

కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని మాళవిక అన్నారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌కు తమ కేఫ్ కాఫీ డే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతానన్నారు.

సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకున్నాను. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం.                                     - మాళవిక హెగ్దే, కేఫ్ కాఫీ డే సీఈఓ

అలా మొదలైంది?

మాళవిక తండ్రి ఎస్‌ఎం కృష్ణ. ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో మాళవికకు వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అన్నారట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు.

ఈసారి ఆయన 'కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?' అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

పడి లేచిన కెరటంలా..

అప్పుల భారంతో సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నాక.. తెరవెనుక ఉన్న మాళవిక తెరపైకి వచ్చి వేల కోట్ల అప్పులకు వారుసురాలయ్యారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు. తన భర్తకు చెడ్డ పేరు రాకూడదని సంస్థను భూజాన వెసుకొని ఏకంగా 3 వేల కోట్లకు పైగా అప్పులను తీర్చేశారు. ప్రస్తుతం ఆమెను ప్రపంచమంతా ఓ గొప్ప యోధురాలిగా పిలుస్తోంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 10 Jan 2022 06:57 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.