ICICI Bank Loan Case: రుణాల జారీలో అవకతవకల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ MD & CEO చందా కొచ్చర్ ‍‌(Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar), వీడియోకాన్ గ్రూప్‌ యజమాని వేణుగోపాల్ ధూత్‌కు (Venugopal Dhoot) సీబీఐ కోర్ట్‌లోనూ ఊరట దక్కలేదు. పిటిషన్‌ మీద అత్యవసర విచారణను బాంబే హై కోర్ట్‌ (Bombay High Court) తిరస్కరించడంతో ఇప్పటికే నీరుగారిపోయి ఉన్న కొచ్చర్‌ దంపతులకు, ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టులోనూ (CBI Special Court) ఊరట దక్కలేదు. నిందితుల కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రేపటి (గురువారం, 29 డిసెంబర్‌ 2022) వరకు పొడిగించింది.


ముగ్గురికీ కస్టడీ
CBI ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎ.ఎస్. సయ్యద్, నిందితులు ముగ్గురిని డిసెంబర్ 28 వరకు CBI కస్టడీకి పంపుతూ గత సోమవారం నాడు ఆదేశించారు. ఇంటి నుంచి వండిన ఆహారం, మందులను తీసుకెళ్లడానికి కూడా అనుమతించారు. ఆ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో, సీబీఐ అధికారులు ఈ ముగ్గురిని తిరిగి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ ధూత్‌ను మరొక్క రోజు CBI కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే, గురువారం వరకు CBI ప్రశ్నల పరంపరను నిందితులు భరించాల్సిందే, సమాధానాలు చెప్పాల్సిందే.


 






 


డిసెంబర్ 23న కొచ్చర్ దంపతుల అరెస్టు
చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను 2022 డిసెంబర్ 23న దిల్లీ కార్యాలయంలో విచారించిన తర్వాత, కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation -CBI) వాళ్లిద్దరినీ అరెస్టు చేసింది. డిసెంబర్ 24 శనివారం నాడు, ముంబైలోని స్పెషల్ వెకేషన్ న్యాయస్థానం జడ్జి SM మెన్జోంగే ఎదుట వాళ్లను హాజరు పరిచింది. నిందితులను డిసెంబర్ 26 వరకు CBI కస్టడీకి అనుమతిస్తూ కోర్ట్‌ రిమాండ్ విధించింది. 



వీడియోకాన్ గ్రూప్‌నకు (Videocon Group) చందా కొచ్చర్‌ హయాంలో మంజూరైన రుణాల అవకతవకల కేసులో, ఆ గ్రూప్‌ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సోమవారం ‍‌(26 డిసెంబర్‌ 2022) నాడు CBI అధికారులు అరెస్టు చేశారు. 


మంగళవారం ఏం జరిగింది?
ఈ కేసులో తమను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మంగళవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టుకు ముందు CBI ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, చట్ట ప్రకారం ఇది అవసరమని వాదించారు. అయితే, ఈ అంశం మీద అత్యవసర విచారణను తిరస్కరించిన వెకేషన్‌ బెంచ్‌, కోర్టుకు సెలవులు ముగిసిన తర్వాత రెగ్యులర్‌ బెంచ్ ఎదుట పిటషన్‌ వేయాలని కొచ్చర్‌ దంపతులను ఆదేశించింది.