ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. ఐటీఆర్‌ దాఖలు చేయడానికి డిసెంబర్‌ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో చాలా వరకూ కార్యకలాపాలు స్తంభించిపోయిన సంగతి తెలిపిందే. ఈ కారణంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు గడువును పెంచింది.










తాజా పొడిగింపునకు మరో కారణం కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇన్ఫోసిస్ డెవలప్ చేసి, నిర్వహిస్తున్న కొత్త ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు కూడా ఐటీఆర్ దాఖలు గడువు పెంపునకు కారణంగా తెలుస్తోంది. 


‘‘ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతరులు మా దృష్టికి తెచ్చిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నాం. అందులో భాగంగా ఐటీ చట్టం, 1961 ప్రకారం ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం వివిధ ఆడిట్ నివేదికలు పరిశీలించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు తేదీని మరింత పొడిగించాలని నిర్ణయించింది’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.


మరోవైపు, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న కొత్త ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు. ఇటీవల ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్‌తో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. అలాగే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని సమస్యల గురించి ఆమె వివరించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు.


Also Read: Gold Silver Price, 9 September 2021: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర


Also Read: Air India: హైదరాబాద్-లండన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు.. ఎయిర్ ఇండియా ప్రకటన, ఎప్పటినుంచంటే..