Canara bank Service Charges: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్, తాను అందించే కొన్ని సేవల మీద వసూలు చేసే రుసుముల మొత్తాన్ని (Service Charges) మార్చింది. మొత్తం 9 సర్వీసుల్లో ఈ మార్పులు చేసింది. ఈ మార్పులన్నీ ఫిబ్రవరి 3, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది.
మీరు కెనరా బ్యాంక్ కస్టమర్ అయితే... చెక్ రిటర్న్, ATM మనీ ట్రాన్సాక్షన్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, ECS డెబిట్, పేరు మార్పు వంటి పనుల కోసం కొత్త రుసుములు చెల్లించాలి.
చెక్ రిటర్న్ (Cheque Return) మీద ఫైన్
కెనరా బ్యాంక్ కస్టమర్ల నుంచి బ్యాంక్ వసూలు చేసే కొత్త ఫీజుల్లో చెక్ రిటర్న్ ఫైన్ కూడా ఒకటి. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కస్టమర్ చెక్కు వెనక్కు తిరిగి వచ్చినట్లయితే, అటువంటి పరిస్థితిలో ఖాతాదారు నుంచి ఎటువంటి రుసుమును బ్యాంక్ వసూలు చేయదు. కానీ, ఇతర కారణాల వల్ల మీ చెక్కు వెనక్కు తిరిగి వచ్చినట్లయితే, మీరు దానికి రుసుము చెల్లించవలసి ఉంటుంది. రూ. 1,000 లోపు విలువైన చెక్కు తిరిగి వచ్చినట్లయితే, మీరు రుసుముగా రూ. 200 చెల్లించాలి. రూ. 1000 నుంచి రూ. 10 లక్షల వరకు చెక్ మీద రూ. 300 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
కనీస నగదు నిల్వ నిబంధన మార్పు
బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ (Minimum Cash Balance) విషయంలోనూ కెనరా బ్యాంక్ మార్పులు చేసింది. మీరు ఖాతాలో తగిన మొత్తాన్ని ఉంచకపోతే, అందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కనీస నగదు నిల్వ, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచ్‌లో మీకు ఖాతా ఉంటే, మీ ఖాతాలో కనీసం రూ. 500 బ్యాలెన్స్ నిర్వహించాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లో మీకు ఖాతా ఉంటే... రూ. 1,000, పెద్ద నగరాలు లేదా మెట్రో నగరాల్లో మీకు ఖాతా ఉంటే రూ. 2,000 కనీస బ్యాలెన్స్ నిర్వహించడం అవసరం. మీ ఏరియా ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే, రూ. 25 నుంచి రూ. 45 వరకు జరిమానాను బ్యాంక్ విధించవచ్చు.
పేరు మార్చుకోవడానికి డబ్బు చెల్లించాల్సిందే
కెనరా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు పేర్లను జోడించడానికి లేదా తొలగించడానికి కూడా రుసుము చెల్లించాలి. ఇందు కోసం, రూ. 100 రుసుము + GST చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా పేరులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సేవలకు మినహాయింపు
మీ ఖాతా జాయింట్ అకౌంట్ అయివుండి, జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అతని పేరును తొలగించడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మీరు ఈ-మెయిల్, చిరునామా, మొబైల్ నంబర్ మార్చడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ATM నుంచి ఒక నెలలో 4 సార్ల వరకు డబ్బులు తీసుకోవచ్చు, దీనిపై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక నెలలో 5వ సారి నుంచి, ప్రతి లావాదేవీ మీద మీరు రూ. 5 + GST చెల్లించాల్సి ఉంటుంది.