Campus Activewear shares: అమెరికన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ TPG గ్లోబల్, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించనుందన్న వార్తలతో షూ కంపెనీ షేర్లు షేక్‌ అయ్యాయి, 8% పైగా పడిపోయి రూ. 337.50 వద్ద కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.


బ్లాక్‌ డీల్‌ వార్తతో షేర్ ధర పతనం
క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌లో TPG గ్లోబల్‌కు 7.6% వాటా లేదా 2,32,07,692 షేర్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఇవాళ (శుక్రవారం, 24 మార్చి 2023) విక్రయించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 


గురువారం (23 మార్చి 2023) నాడు ఈ స్టాక్‌ రూ. 369.10 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి బ్లాక్ డీల్ కోసం, ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ధరను రూ. 345గా TPG నిర్ణయించింది, గురువారం నాటి ముగింపు ధరలో ఇది దాదాపు 7% డిస్కౌంట్‌కు సమానం. ప్రస్తుతం ఉండాల్సిన షేర్‌ విలువ అదే అన్న అంచనాలతో, ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ కౌంటర్‌ నష్టపోయింది.


ఉదయం 11.35 గంటల సమయానికి, BSEలో, 7.00% లేదా రూ. 25.85 నష్టంతో ఒక్కో షేర్‌ రూ. 343.25 వద్ద కదులుతోంది. 


2017 సెప్టెంబర్‌లో, TPG గ్లోబల్‌కు చెందిన TPG గ్రోత్, హావెల్స్ గ్రూప్ (Havells Group) ప్రమోటర్ల ఫ్యామిలీ ఆఫీస్‌ అయిన QRG, క్యాంపస్ యాక్టివ్‌వేర్‌లో రూ. 1,500 కోట్లతో పె 20% వాటాను కొనుగోలు చేశాయి. కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి (Kuwait Investment Authority) కూడా 1.3% వాటా ఉంది. ఇవన్నీ ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs).


2022 మే నెలలో లిస్టయిన క్యాంపస్‌ యాక్టివ్‌ వేర్‌, ఇప్పటి వరకు కేవలం 3% మాత్రమే లాభపడింది. గత 6 నెలల్లో, ఈ స్టాక్ విలువ 40% పైగా కోత పడింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) 17% క్షీణించింది.


ఈ స్టాక్‌, రూ. 640 వద్ద 52-వారాల గరిష్ట స్థాయికి చేరింది, అక్కడి నుంచి షార్ప్‌ కరెక్షన్‌ చూస్తోంది. 52-వారాల కనిష్ట స్థాయి రూ. 296.85.
2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ నికర లాభం రూ. 48.31 కోట్లుగా లెక్క తేలింది, దీనికి ముందు ఏడాది ఇదే కాలంలోని రూ. 54.72 కోట్ల నుంచి తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన కేవలం 7.4% పెరిగి రూ. 465.62 కోట్లకు చేరుకుంది.


టార్గెట్ ప్రైస్‌ రూ. 474
Trendlyne డేటా ప్రకారం.. ఈ స్టాక్ యొక్క సగటు టార్గెట్ ప్రైస్‌ రూ. 474. ప్రస్తుత మార్కెట్ ధర స్థాయి నుంచి 39% ర్యాలీ చేసే సత్తా ఈ స్టాక్‌కు ఉందని ఈ టార్గెట్‌ అర్ధం. క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ను ట్రాక్‌ చేస్తున్న నలుగురు ఎనలిస్ట్‌లు "స్ట్రాంగ్‌ బయ్‌"ని సిఫార్సు చేశారు.


మన దేశంలోని అతి పెద్ద స్పోర్ట్స్ & అథ్లెయిజర్ ఫుట్‌వేర్‌ బ్రాండ్‌లలో క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఒకటి. నివేదికల ప్రకారం, విలువ & వాల్యూమ్ పరంగా, 2021లో, భారతదేశంలో అతి పెద్ద స్పోర్ట్స్ & అథ్లెయిజర్ బ్రాండ్ ఇది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.