Campa Cola: భారత మార్కెట్‌ను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకి పోటీగా ముకేష్ అంబానీ తీసుకొచ్చిన దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ 'కాంపా కోలా', అతి త్వరలో దేశవ్యాప్తంగా జనం గొంతులు తడపబోతోంది. ఈ శీతల పానీయాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రస్తుతానికి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్‌లో గరిష్ట వాటాను కైవసం చేసుకోవడాలన్నది RIL ప్లాన్‌.


రిలయన్స్ ఇండస్ట్రీస్ FMCG విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ (RCPL), కాంపా కోలా కూల్‌డ్రింక్స్‌ను వచ్చే 2-3 మూడు వారాల్లోనే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని సమాచారం.


ప్రస్తుతం అతి తక్కువ ధరకు విక్రయాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో కోలా, లెమన్‌, ఆరెంజ్‌ వేరియంట్‌లతో కాంపా కోలాను రిలయన్స్‌ అమ్ముతోంది. పోటీ కంపెనీలు కోకా కోలా, పెప్సికో రేట్లలో సగం కంటే తక్కువ ధరకే మార్కెట్‌ చేయడంతో, విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే, కాంపా కోలా జీరో షుగర్ వేరియంట్‌ 200ml క్యాన్‌ను కేవలం ₹20కి విడుదల చేసింది. తక్కువ రేట్లతో కోకా కోలా, పెప్సికో మార్కెట్‌ వాటాకు రిలయన్స్‌ ఎసరు పెట్టింది.


కాంపా కోలా బాట్లింగ్ కార్యకలాపాలను విస్తరించడానికి కొత్త భాగస్వాములతో RCPL చర్చిస్తోంది. ఈ బ్రాండ్‌ను పండ్ల ఆధారిత పానీయాలు, సోడా, ఎనర్జీ, జీరా డ్రింక్‌గా కూడా తీసుకురావాలని యోచిస్తోంది.         


దక్షిణాది కంపెనీలతో ఒప్పందం
ట్రూ & యూ టూ బ్రాండ్‌ల క్రింద మిల్క్ షేక్స్, ఫ్రూట్ డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్న తమిళనాడుకు చెందిన ఏషియన్ బెవరేజ్‌తో ‍‌(Asian Beverage), చెన్నైకి చెందిన బోవోంటో ‍‌(Bovonto) శీతల పానీయాల తయారీ సంస్థ కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌తో (Kali Aerated Water Works) రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, కాంపా కోలాను ఆయా కంపెనీల ప్లాంట్లలో తయారు చేసి, మార్కెట్‌ చేస్తారు. ఇప్పటికే.. జల్లాన్ ఫుడ్ ప్రొడక్ట్స్‌తో (Jallan Food Products) ఒప్పందం చేసుకుని, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని ప్లాంట్లలో కాంపా బాట్లింగ్‌ చేస్తోంది.       


గత సంవత్సరం ఆగస్టులో కాంపా కోలాను కొనుగోలు చేయడానికి ముందే, కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరిపింది, అవి సఫలం కాలేదు. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌కు ఎనిమిదికి పైగా తయారీ ప్లాంట్లు ఉన్నాయి.   


దేశంలోని అన్ని కిరాణా, పాన్-సిగరెట్, శీతల పానీయాల దుకాణాల్లో కాంపా కోలా ఉండాలన్నది RCPL ప్లాన్‌. ఇందుకోసం.. వీటిని జియోమార్ట్‌ B2B, మెట్రో క్యాష్ & క్యారీ నెట్‌వర్క్‌లో అమ్మడంతో పాటు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ B2B ప్లాట్‌ఫామ్‌తోనూ జత కట్టింది. 


రిలయన్స్, గత ఆగస్టులో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ (Pure Drinks Group) నుంచి కాంపా బ్రాండ్‌ను సుమారు ₹22 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.