Byjus India CEO:


ఎడ్యూటెక్‌ కంపెనీ బైజూస్‌ (Byjus) అగ్రనాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సీనియర్‌ ఉద్యోగి అర్జున్‌ మోహన్‌ భారత వ్యాపారానికి సీఈవోగా ఎంపికయ్యారు. మృణాల్‌ మోహిత్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ అప్పుల భారంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే.


వ్యక్తిగత కారణాలతోనే మోహిత్‌ కంపెనీ నుంచి వైదొలగుతున్నట్టు బైజూస్‌ తెలిపింది. గతేడాది మే నుంచి ఆయన భారత వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కంపెనీ స్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ (Byju Raveendran) అంతర్జాతీయ వ్యాపారంపై దృష్టి సారించడంతో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు.


'అర్జున్‌ మోహన్‌ బైజూస్‌లోకి తిరిగి రావడం కంపెనీ లక్ష్యాలు, మున్ముందు లభించే అసమాన అవకాశాలపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మేం తిరిగి నిలదొక్కుకొనేందుకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ఎడ్యూటెక్‌ వ్యాపారంలో మా స్థానాన్ని పటిష్ఠం చేస్తుంది' అని బైజూ రవీంద్రన్‌ అన్నారు.


నిజానికి అర్జున్‌ గతంలో బైజూస్‌లో కీలక పాత్ర పోషించారు. 2020 వరకు కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. రోనీ స్క్రూవాలా స్థాపించిన అప్‌గ్రేడ్‌కు సీఈవోగా వెళ్లడంతో రాజీనామా చేశారు. అయితే రవీంద్రన్‌ అంతర్జాతీయ వ్యాపార నిర్వహణలో బిజీగా ఉండటంతో ఈ ఏడాది జులైలో ఆయన మళ్లీ బైజూస్‌కు తిరిగొచ్చారు.


బయటకు వెళ్లిపోతున్న మోహిత్‌ బైజూస్‌ స్థాపక బృందంలో కీలక సభ్యుడు. ఇద్దరు స్థాపకులతో కలిసి పదేళ్ల పాటు పనిచేశారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌గా పనిచేస్తున్న ఆయన 2016లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.


'బైజూస్‌ నేడున్న అత్యున్నత స్థితికి రావడానికి స్థాపక బృందం శ్రమే కారణం. మృణాల్‌ సేవలు మా కంపెనీపై చెరగని ముద్ర వేశాయి. అతడు బయటకు వెళ్లిపోవడం మాకు సంతోషంతో కూడిన బాధను కలిగించింది. మేమంత కలిసి సాధించనదానికి నేను గర్వపడుతున్నాను' అని రవీంద్రన్‌ తెలిపారు. 'అత్యంత ముఖ్యమైన అంశాల్లో నేను మృణాల్‌ సలహాలు తీసుకొనేవాడిని. వ్యక్తిగతంగా అతడు నాకెంతో ఆప్తుడు. మిగిలినవి పక్కన పెడితే కంపెనీ పరివర్తన విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉంది. బైజూస్‌ వృద్ధి పథంలో పయనిస్తుంది' అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం బైజూస్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రుణాలు తిరిగి చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 1.2 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లింపులో రుణదాతలతో వివాదం కొనసాగుతోంది.


మరోవైపు భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం చుక్కలు చూపించాయి. ఆరంభం నుంచి నేల చూపులు చూశాయి. క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకడం, డాలర్‌ ఇండెక్స్‌ విపరీతంగా పెరగడం, యూఎస్‌ బాండ్‌ యీల్డుల పెరుగుదల వంటివి పతనానికి ప్రధాన కారణాలు. వీటికి ద్రవ్యోల్బణం, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం వంటివి దోహదం చేశాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 231 పాయింట్లు తగ్గి 19,901 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 796 పాయింట్లు పతనమై 66,800 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 83.08 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు ఒక్క రోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు.