Union Budget 2025 Presentation LIVE Online: శనివారం, ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇది, ఆమెకు వరుసగా ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం. ఆర్థిక మందగమన సంకేతాల నడుమ, భారతదేశ వృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేందుకు బడ్జెట్‌లో కీలక చర్యలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
బడ్జెట్‌ను ఏ సమయంలో ప్రజెంట్ చేస్తారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2025న ప్రారంభం అయ్యాయి. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 01న ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది.
ఈ సంవత్సరం బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా కొనసాగుతుంది. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. రెండో భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 04న ముగుస్తుంది.
బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కోసం ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
పార్లమెంట్ సమావేశాలు, నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతాయి. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూడాలని & వినాలని మీరు భావిస్తుంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. అధికారిక కేంద్ర బడ్జెట్ వెబ్‌సైట్ (indiabudget.gov.in), సంసద్ టీవీ YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు వీక్షించవచ్చు.
ABP దేశం.. వివరణాత్మక విశ్లేషణలు, కథనాలతో పాటు ప్రత్యక్ష టీవీ కవరేజీని కూడా అందిస్తుంది, అంతేకాదు, ABP దేశం వెబ్‌సైట్‌లో రోజంతా ఇన్-టైమ్‌లో అప్‌డేట్స్ చూడవచ్చు.
నిర్మల సీతారామన్‌కు ఒక చారిత్రక మైలురాయి
ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మల సీతారామన్ రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది. ఈ బడ్జెట్‌తో, భారతదేశ చరిత్రలో వరుసగా ఎనిమిది బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ నిలుస్తారు. వీటిలో ఏడు వార్షిక బడ్జెట్‌లు & ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. బడ్జెట్ నంబర్ విషయంలో.. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, మొరార్జీ దేశాయ్ వంటి ఘనాపాఠీల కంటే ఆమె ముందు ఉన్నారు.
నిర్మల సీతారామన్ భారతదేశపు తొలి పూర్తికాల మహిళ ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. తన పదవీకాలంలో, 2020 బడ్జెట్‌లో సరళీకృత కొత్త పన్ను విధానం సహా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టారు. 2019లో, సాంప్రదాయంగా వస్తున్న 'లెదర్ బ్రీఫ్‌కేస్'కు బదులుగా బడ్జెట్‌ను సమర్పించడానికి 'బహి-ఖాటా' (సాంప్రదాయ ఖాతా పుస్తకం)ను ఉపయోగించడం ద్వారా ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టారు. 'డిజిటల్ ఇండియా' పరివర్తనకు అనుగుణంగా, కేంద్ర బడ్జెట్ ఇప్పుడు పూర్తిగా కాగిత రహితంగా మారింది.
2025 బడ్జెట్ నుంచి ఏం ఆశించవచ్చు?
భారతదేశ GDP వృద్ధి మందగించడం, సహా అనేక ప్రస్తుత సవాళ్ల దృష్ట్యా.. 2025 బడ్జెట్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం, దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌లు, కార్పొరేట్ పన్నులకు సర్దుబాట్లు సహా కొన్ని రకాల పన్ను సవరణలను కూడా ఊహిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా?