Economic Survey 2023 Highlights:


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు.


ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్‌ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.


కరోనా, ఇతర అవాంతరాల వల్ల నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థ తిరిగి బలంగా పుంజుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. కరోనాకు ముందు 8.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని వెల్లడించింది. 'ప్రపంచంలోని చాలా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌ ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. కొవిడ్‌ 19 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంతో ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగింది. ఫలితంగా భారత్‌ సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి' అని వెల్లడించింది.


ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత, పెట్టుబడులను బలహీనపరిచే స్థాయిలో ద్రవ్యోల్బణం లేదని సర్వే నివేదించింది. అయితే 2023 ఆర్థిక ఏడాదికి ఆర్బీఐ పెట్టుకున్న లక్ష్యం కన్నా కాస్త ఎక్కువగానే ఉందని వెల్లడించింది. 


'అంతర్జాతీయంగా ముడి సరుకులు, లోహాల ధరలు పెరగడంతో కరెంటు ఖాతా లోటు (CAD) పెరిగింది. భారత వృద్ధి జోరు మాత్రం బలంగా ఉంది. కరెంటు ఖాతా లోటు పెరిగితే రూపాయి విలువపై ప్రభావం పడుతుంది. మొత్తంగా బాహ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చగల, రూపాయి ఒడుదొడుకులను నియంత్రించగల విదేశీ మారక ద్రవ్యం భారత్‌ వద్ద ఉంది' అని సర్వే తెలిపింది.


ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆశాజనకంగా లేదని ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు, కేంద్ర బ్యాంకులు కీలక రెపో రేట్లను ఇంకా సవరించే  అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచితే రూపాయి బలహీనత కొనసాగే అవకాశం ఉందంది. వడ్డీరేట్ల పెంపు ఇలాగే కొనసాగితే దీర్ఘకాలం రుణభారం మరింత పెరుగుతుందని వెల్లడించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.