Sensex @ 79,000: దేశీయ స్టాక్ మార్కెట్లు పూర్తిగా బుల్స్ హవాలో కొనసాగుతున్నాయి. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ కీలక బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రోజూ కొత్త జీవితకాల గరిష్ఠాలను తాకుతూ ఇన్వెస్టర్లను కొత్త ఉత్తేజానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లలో బుల్ జోరు మాత్రం అన్‌స్టాపబుల్ రేంజ్‌కి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో తొలిసారిగా బీఎస్ఈ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79,000 మార్కును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది. నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో మార్కెట్ సూచీ ఏకంగా 79,033.91 స్థాయికి చేరుకుని తన గత అన్ని రికార్డులను బద్ధలుకొట్టింది. వాస్తవానికి ఉదయం స్వల్ప నష్టాలతో ఒడిదొడుకుల్లో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ తర్వాత వేగంగా పుంజుకున్నాయి. మార్కెట్లలో హెవీ వెయిట్ కలిగిన కంపెనీల షేర్లు బలమైన ర్యాలీని నమోదు చేయటంతో సరికొత్త స్థాయిలకు సెన్సెక్స్ చేరుకుంది.
స్టాక్ మార్కెట్లలోని విశ్లేషకుల అంచనా ప్రకారం త్వరలోనే సెన్సెక్స్ సూచీ 80,000 మార్కును అందుకుంటుందని తెలుస్తోంది. ఒకపక్క మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేతృత్వంలోని మోదీ సర్కార్ అధికారంలోకి రావటం పెట్టుబడిదారుల్లో భారత భవిష్యత్తు వృద్ధిపై నమ్మకాన్ని బలపరుస్తుండగా.. మరో పక్క వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మార్కెట్లపై విదేశీ మదుపరులతో పాటు దేశీయ ఇన్వెస్టర్ల అంచనాలు భారీగా ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందే అనేక బ్రోకరేజ్ సంస్థలు రానున్న కాలంలో సెన్సెక్స్ సూచీ లక్ష పాయింట్ల మార్కుకు చేరుకుంటుందని అంచనాలను పంచుకున్నాయి.
వీటికి తోడు స్టాక్ మార్కెట్లు వేగంగా పుంజుకోవటానికి మరో కారణం వరుసగా లిస్టింగ్ అవుతున్న అనేక ఐపీవోలు. గత రెండేళ్ల కాలంలో ప్రతినెల భారీ సంఖ్యలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో అనేక కంపెనీల ఐపీవోలు జాబితా అయ్యాయి. పైగా వీటిలో దాదాపు 90 శాతం కంపెనీల ఐపీవోలు బంపర్ లిస్టింగ్ చేసి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్ లో వరుస కంపెనీల లిస్టింగ్ ల రాక సైతం పెరుగుదలకు దోహదపడుతోందని నిపుణులు తాజా ర్యాలీకి కారణాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.
ఉదయం భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. నెలవారీ F&O గడువు ముగిసే రోజున వరుసగా నాల్గవ రోజు బుల్ రన్‌ను సూచీలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 79000 మార్కును అధిగమించగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ట్విన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి హెవీవెయిట్ స్టాక్‌ల పురోగతితో నిఫ్టీ-50 ఇండెక్స్ 23,900 స్థాయిని తాకింది.