Silver Price: వాస్తవానికి భారతీయుల బంగారం, వెండి ప్రియులు. అందుకే కొంచెం డబ్బులు ఉన్నా వారు విలువైన లోహాలను, వాటితో చేసిన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి రేట్లు భారీ ఒడిదొడుకులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి ధర తారా స్థాయికి చేరుకుంటోంది.


దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం రానున్న రోజుల్లో వెండి ధర కేజీకి రూ.1.25 లక్షలకు చేరవచ్చని తన అంచనాను వెల్లడించింది. దీంతో సామాన్యుల గుండె గుబేల్ మంటోంది. ఇప్పటికే బంగారం సామాన్యులు కొనలేని స్థాయిలకు చేరుకోగా.. వెండి సైతం అదే దారిలో పయనించటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో వెండి ధరలకు సంబంధించి పెద్ద అంచనా వేస్తూ.. ధరలు తగ్గుతున్న సందర్భంలో వెండిని కొనుగోలు చేయాలని పెట్టుబడిదారులకు సూచిస్తోంది. 


మార్కెట్ ధరలను పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి కేజీ రేటు రూ.లక్ష మార్కుకు చేరుకుంది. అలాగే కొన్ని చోట్ల దేశంలో దీని ధర లక్షకు మించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ వెండిపై త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. తాజాగా బ్రోకరేజ్ హౌస్ వెండి ధరలకు సంబంధించి దాని పాత టార్గెట్ ధరను సవరించింది. మోతీలాల్ ఓస్వాల్ వెండిపై పాత టార్గెట్ ధరను కేజీకి రూ.లక్ష నుంచి తాజాగా రూ.1,25,000కి పెంచింది. కామెక్స్‌లో టార్గెట్ ఔన్సుకు 40 డాలర్లుగా ఇవ్వబడింది. 12 నుంచి 15 నెలల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ నివేదికలో పేర్కొంది.  


బ్రోకరేజ్ హౌస్ పరిశోధన నోట్ ప్రకారం ఇటీవలి నెలల్లో వెండి ధరలు దేశీయంగా 30 శాతం పెరిగాయి. పెరుగుతూపోతున్న వెండి ధరల్లో ఏదైనా తగ్గుదల నమోదైతే దానిని కొనుగోలుకు అవకాశంగా చూడాలని బ్రోకరేజ్ పేర్కొంది. ఈ క్రమంలో వెండికి ప్రధాన మద్ధతు స్థాయి 86,000 - 86,500 గా ఉంటుందని బ్రోకరేస్ సంస్థ పేర్కొంది. ఇటీవలి మెగా ర్యాలీతో స్లో మూవర్ అనే ట్యాగ్ నుంచి వెండి బయటపడిందని చెప్పుకోవచ్చు. బంగారంతో కొనసాగుతున్న రేసులో  వెండి గెలుపుకు దగ్గరవుతోంది. అలాగే చాలా కాలంగా ఇన్వెస్టర్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


పెరిగిన దేశీయ వినియోగం:
2024లో వెండి దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది 4000 టన్నులకు దిగుమతులు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ పెంచటం వినియోగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో వెండి కమర్షియల్ వినియోగం పెరిగటం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నట్లు తెలుస్తోంది. ఈటీఎఫ్‌లో ప్రవాహం సాధారణమే కానీ ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ కంటే వెండి సరఫరా తక్కువగా ఉండవచ్చని సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడింది. దీనికి తోడు చైనా నుంచి పెరుగుతున్న డిమాండ్ సైతం ధరలను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 


Also Read: మళ్లీ 5 శాతం దాటిన ద్రవ్యోల్బణం - మీ EMI భారం ఇప్పట్లో తగ్గదు!


Also Read: ఏంటి, కొడుకు పెళ్లి కోసం ముకేశ్ చేస్తున్న ఖర్చు అంతేనా - చాలా ఆశ్చర్యంగా ఉందే!