Britannia Industries Will Close Kolkata Factory: ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎట్టకేలకు, అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 1947లో, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రారంభించిన ఫ్యాక్టరీల్లో ఒకదానిని ఈ కంపెనీ క్లోజ్ చేయబోతోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న చారిత్రాత్మక కర్మాగారం తలుపులను బ్రిటానియా ఇండస్ట్రీస్ శాశ్వతంగా మూసేస్తోంది. ఇది, ఈ బిస్కట్ కంపెనీ తొలి ఉత్పత్తి యూనిట్. మేరీ గోల్డ్, గుడ్ డే వంటి బిస్కెట్ల తయారీతో ఈ యూనిట్‌కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం, ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులంతా స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement Scheme లేదా VRS) నిర్ణయం తీసుకున్నారు.
ఏ ఉద్యోగిపై ప్రభావం పడకుండా ఫ్యాక్టరీ మూసివేత
కోల్‌కతాలోని తన ఉత్పత్తి యూనిట్‌ను మూసేస్తున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా బ్రిటానియా ఇండస్ట్రీస్ వెల్లడించింది. 1947లో నిర్మించిన ఈ కర్మాగారం కంపెనీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించింది. ఫ్యాక్టరీని మూసివేయడం వల్ల ఏ ఒక్క ఉద్యోగిపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ వెల్లడించింది. ఫ్యాక్టరీలోని శాశ్వత ఉద్యోగులందరూ వాలెంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌కు అంగీకరించారని ప్రకటించింది. కోల్‌కతాలోని ఫ్యాక్టరీ మూతపడడం వల్ల కంపెనీ వ్యాపారంపైనా ఎలాంటి ప్రభావం పడదని కూడా బ్రిటానియా తెలిపింది.
పాత కర్మాగారాన్ని నడపడం వల్ల ప్రయోజనం లేదు
స్వాతంత్ర్య కాలం నాటి పాత ఫ్యాక్టరీని నడపడం బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు ఆర్థికంగా లాభదాయకం కాదని జాతీయ మీడియా గతంలో చాలాసార్లు రిపోర్ట్ చేసింది. కంపెనీ యాజమాన్యం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. చాలాకాలం పాటు దీనిపై చర్చించిన పిదప ఎట్టకేలకు మూసివేత నిర్ణయం తీసుకుంది.
కోల్‌కతాలోని తరటాలా ప్రాంతంలో ఈ బిస్కట్ ఫ్యాక్టరీని నిర్మించారు. దాదాపు 11 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు, లీజు గడువు 2048 వరకు ఉంది. అంటే, మరో 24 ఏళ్ల పాటు ఆ భూమి బ్రిటానియా ఇండస్ట్రీస్ ఆధీనంలోనే ఉంటుంది. బిస్కట్ ఫ్యాక్టరీని మూసేసిన తర్వాత, 2048 వరకు ఆ భూమిని ఎలా ఉపయోగించుకుంటారన్న విషయానికి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు.
నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, కోల్‌కతా ఫ్యాక్టరీ మూసివేత వల్ల దాదాపు 150 మంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. కర్మాగారాన్ని మూసివేయడం వల్ల కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదని వాటాదార్లందరికీ బ్రిటానియా ఇండస్ట్రీస్ సమాచారం ఇచ్చింది.
ఈ రోజు (మంగళవారం, 25 జూన్ 2024) ఉదయం 11.45 గంటల సమయానికి బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ ధర 1% పైగా పెరిగి రూ. 5,352.75 దగ్గర కదులుతోంది. చాలా కాలంగా ఈ స్టాక్ తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. గత నెల రోజుల్లో దాదాపు 3 శాతం, గత ఆరు నెలల్లో 2 శాతం పైగా పెరిగింది. గత 12 నెలల్లో (ఏడాదిలో) దాదాపు 7 శాతం ర్యాలీ చేసింది, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూస్తే ఫ్లాట్‌గా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో చవగ్గా దొరుకుతున్న స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి