Lloyd AC Sales In Blinkit App: క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన వ్యాపార పరిధిని వేగంగా విస్తరిస్తోంది & డెలివెరీ లిస్ట్‌ను పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు వేసవి కాలం ప్రారంభం కావడంతో, ఈ ప్లాట్‌ఫామ్ ఎయిర్ కండిషనర్ల (AC) డెలివరీని కూడా ప్రారంభించింది. ప్రస్తుతానికి, ఈ ఫెసిలిటీ 'దిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతానికి' (Delhi-NCR) మాత్రమే పరిమితం. బ్లింకిట్ నుంచి ఏసీల డెలివెరీ వార్తను ఆ కంపెనీ సీఈఓ అల్బిందర్ దిండ్సా (Blinkit CEO Albinder Dindsa) స్వయంగా వెల్లడించారు. బ్లింకిట్ గత సంవత్సరం కూలర్ల క్విక్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది.
లాయిడ్స్ ఇండియాతో భాగస్వామ్యం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో మెసేజ్ పోస్ట్ చేసిన ధిండ్సా, "ఈ సర్వీస్ కోసం మా కంపెనీ లాయిడ్స్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దిల్లీ-NCRలో డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీస్ ప్రారంభం అవుతుంది. డెలివరీ అయిన 24 గంటల్లోపు ఇన్‌స్టలేషన్ పనులు కూడా ప్రారంభం అవుతాయి" అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఎండలు, వాడగాడ్పుల కారణంగా ఎయిర్ కండిషనర్ల డిమాండ్ 25-30 శాతం పెరిగి 14-15 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ బ్లింకిట్ కొత్త సర్వీస్ ప్రారంభం కావడం విశేషం.
మూడు నెలల్లో మారిన మాట, బాట
వాస్తవానికి, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్బిందర్ దిండ్సా, ఏసీలు అమ్మకూడదని తాము జనవరిలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ మాటకు విరుద్ధంగా, మార్చి చివరి నాటికి ఏసీల డెలివెరీ ప్రారంభించారు కూడా. దీనికి కారణాన్ని కూడా దిండ్సా చెప్పారు. "Q-కామర్స్ కంపెనీలు భారీ & అధిక ధర ఉత్పత్తులను అందించడంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు. కాబట్టి ACలను అమ్మకూడదని జనవరిలో నిర్ణయించుకున్నాం. కానీ, ACలపై ప్రజల్లో బలమైన ఆసక్తి ఉంది. మార్చి నాటికి, ప్రజలు రోజుకు 15,000 సార్లు ACల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు" అని ధిండ్సా చెప్పారు. ప్రజల నుంచి కనిపించిన ఆసక్తి వల్లే కంపెనీ డెలివెరీ చేసే ఉత్పత్తుల లిస్ట్‌లో ACలను చేర్చినట్లు వెల్లడించారు.
AC క్విక్ డెలివరీని ఈ కంపెనీలు కూడా అందిస్తున్నాయి
క్రోమా వంటి ఈ-కామర్స్ & ఎలక్ట్రానిక్ రిటైల్ చైన్స్ కూడా తమ లాజిస్టిక్‌లను మెరుగుపరిచుకున్నాయి. దీనివల్ల AC డెలివరీకి ఇప్పుడు ఒక రోజు కంటే తక్కువ సమయం పడుతుంది. ఫిబ్రవరిలో, క్రోమా 30కి పైగా నగరాల్లో ACలు & కూలర్ల కోసం "ఒక్క రోజులో డెలివరీ" (Delivery within one day) సౌకర్యాన్ని ప్రారంభించింది. విజయ్ సేల్స్ కూడా ఇప్పటికే ఈ సర్వీస్‌ను స్టార్ట్ చేసింది. AC లేదా కూలర్‌ను సాయంత్రం 4 గంటల లోగా ఆర్డర్ చేస్తే, ఈ కంపెనీ అదే రోజు డెలివరీ చేస్తుంది. ఈ లిస్ట్‌లో అమెజాన్ కూడా ఉంది, ఆర్డర్ చేసిన 48 గంటల్లోపు AC & ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఇంటికి తెచ్చి అందిస్తుంది. ఇందులో ఉచిత ఇన్‌స్టాలేషన్ సౌకర్యం కూడా ఉంది.