Crypto currency crash: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆర్థిక వ్యవస్థలను కుదిపివేస్తున్నాయి! అంతర్జాతీయంగా అన్ని స్టాక్‌ మార్కెట్లు పతనమవుతున్నాయి. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ ఏకంగా 45 శాతం దిగజారింది. క్రిప్టో కరెన్సీలు కూడా పతనం దిశగా సాగుతున్నాయి. యుద్ధభయంతో బిట్‌కాయిన్‌ ఏకంగా 12 శాతం వరకు పడిపోయి కాస్త కోలుకుంది.


ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మార్కెట్‌ విలువ కలిగిన బిట్‌కాయిన్‌ ప్రస్తుతం 8 శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 34,932 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఒక బిట్‌కాయిన్‌ ధర రూ.28.45 లక్షలకు పడిపోయింది. మార్కెట్‌ విలువ రూ.54,72,017 కోట్లుగా ఉంది. 


బిట్‌కాయిన్‌ తర్వాత అత్యంత విలువైన ఎథిరియమ్‌ పరిస్థితీ అదే. దాదాపుగా పది శాతం పతనమైంది. ప్రస్తుతం 2,376 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత కరెన్సీ ప్రకారం ఈ కాయిన్ ధర రూ.1,91,733గా ఉంది. మార్కెట్‌ విలువ రూ.24,20,390 కోట్లకు పరిమితమైంది. ఎక్కువ ప్రాచుర్యం పొందిన డోజీకాయిన్‌ 12, షిబా ఇను 10, పొల్కాడాట్‌ 10, పాలీగాన్‌ 12 శాతం వరకు నష్టపోయాయి. ఎక్స్‌ఆర్‌పీ 9 శాతానికి పైగా పతనమైంది.


మరికొన్నాళ్లూ ఇంతే


'రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో గత 24 గంటల్లో గ్లోబల్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ దాదాపుగా 191 శాతం పడిపోయింది. బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ సహా ప్రధాన ఆల్ట్‌ కాయిన్స్‌ ధరలు దిగజారాయి. దీనంతటికీ కారణం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడమే' అని మడ్రెక్స్‌ కో ఫౌండర్‌, సీఈవో ఎడుల్‌ పటేల్ అంటున్నారు.


మరికొన్ని వారాలూ క్రిప్టో మార్కెట్లు పతనమయ్యే అవకాశం ఉందని పటేల్‌ పేర్కొన్నారు. కొన్ని వారాలుగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు క్రిప్టో మార్కెట్లను వెంటాడుతున్నాయని వెల్లడించారు. అందుకే క్రిప్టో మార్కెట్లన్నీ ఒడుదొడుకులకు లోనవుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం క్రిప్టో కరెన్సీలే కాకుండా ఆర్థిక మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లపై ఈ ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు.