Bitcoin Market Cap: కొత్త సంవత్సరంలో (2024) క్రిప్టో ప్రపంచం మహా ఉత్సాహంగా ఊగిపోతోంది. వర్చువల్‌ అసెట్స్‌లో ‍‌(Virtual Assets) అత్యంత జనాదరణ, విలువ ఉన్న 'బిట్‌కాయిన్', ఇప్పుడు చారిత్రాత్మక ర్యాలీ చేస్తోంది. క్రిప్టో ఆస్తుల్లో (Crypto Assets) వేగంగా పెరిగిన కార్యకలాపాల నుంచి ఈ టోకెన్‌ ఎక్కువ లబ్ధి పొందుతోంది, కొత్త రికార్డులు సృష్టిస్తోంది.


వెనుకబడిన వెండి
వేగంగా దూసుకెళ్తున్న బిట్‌కాయిన్‌ పదఘట్టాల కింద నలిగి పాత రికార్డులన్నీ ఎప్పుడో బద్ధలయ్యాయి, కొత్త మైలురాళ్లు శరణుజొచ్చాయి. ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది, కొత్త ప్రాంతాలను & ఉన్నత శిఖరాలను అన్వేషిస్తోంది. ఈ భీకర ర్యాలీ వల్ల బిట్‌కాయిన్ వైపు పెట్టుబడిదార్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు, పెట్టుబడుల మొత్తం అనూహ్యంగా పెరుగుతోంది. 


పెరుగుతున్న ధర, నిరంతర పెట్టుబడుల కారణంగా బిట్‌కాయిన్ ఇప్పుడు విలువైన లోహాలను సైతం అధిగమించడం ప్రారంభించింది. ఈ వర్చువల్‌ అసెట్‌ జోరుకు వెండి కూడా వెనుకబడింది.


ఈ రోజు (బుధవారం 13 మార్చి 2024) మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి, ఒక యూనిట్ బిట్‌కాయిన్ విలువ 73,539 డాలర్లకు చేరింది. దీనికి ఒక రోజు ముందు, మార్చి 12 నాటి ట్రేడింగ్‌లో, బిట్‌కాయిన్ ధర 72,850 డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఈ టోకెన్‌ కొత్త చారిత్రక గరిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుత ర్యాలీకి ముందు, బిట్‌కాయిన్ ధర ఎప్పుడూ 70,000 డాలర్లను దాటలేదు.


భారతీయ కరెన్సీలో చెప్పుకుంటే, ప్రస్తుతం, ఒక బిట్‌కాయిన్ ధర 60 లక్షల రూపాయల స్థాయిని దాటింది, దాదాపు రూ. 61 లక్షల రూపాయల దగ్గర ఉంది. 


బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువ ఇదీ..
ప్రస్తుత ర్యాలీ ప్రభావంతో, బిట్‌కాయిన్ మార్కెట్ విలువ (Bitcoin Market Cap) ఇప్పుడు 1.414 ట్రిలియన్ ‍‌డాలర్లకు చేరుకుంది. ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లకు సమానం. 


విలువైన లోహాల్లో, వెండి మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ప్రస్తుతం 1.38 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్‌ విలువ పరంగా చూస్తే.. బిట్‌కాయిన్ ఇప్పుడు వెండిని దాటింది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత విలువైన 8వ ఆస్తి తరగతిగా (8th most valuable asset class in the world) నిలిచింది. 14.7 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ఉన్న బంగారం, అత్యంత విలువైన ఆస్తి తరగతుల్లో ఒకటిగా కొనసాగుతోంది.


కేవలం రెండు అడుగుల దూరంలో గూగుల్‌ మాతృ సంస్థ
ప్రస్తుత ర్యాలీలో, బిట్‌కాయిన్ చాలా పెద్ద కంపెనీలను కూడా దాటి ముందుకు వెళ్లింది. ఈ క్రిప్టో అసెట్‌ వల్ల వెనుకబడిన పెద్ద కంపెనీల్లో ఫేస్‌బుక్ (Facebook) మాతృ సంస్థ మెటా కూడా ఉంది. మెటా ప్రస్తుత మార్కెట్ క్యాప్ (Meta M Cap) 1.23 ట్రిలియన్ డాలర్లు. బిట్‌కాయిన్ ధర పెరుగుతున్న తీరు & వేగం ఇలాగే కొనసాగితే, త్వరలోనే, గూగుల్‌ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ‍‌కూడా వెనుకబడొచ్చు. ప్రస్తుతం ఆల్ఫాబెట్‌ మార్కెట్ విలువ (Alphabet M Cap) 1.72 ట్రిలియన్ డాలర్లు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ నెల 15 తర్వాత పేటీఎం అకౌంట్‌ & వాలెట్‌లోని డబ్బు ఏమవుతుంది?