షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్‌ బుల్‌, ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి దిగబోతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆయన విమానయాన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.


ఆకాశ ఎయిర్ లైన్స్..


దీనికి సంబంధించి మరో 15 రోజుల్లో విమానయాన శాఖ నుంచి 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌' వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రానున్న నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న విమానాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం తన తరఫున ప్రస్తుతానికి 35 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.260.25 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. సంస్థలో తనకు 40 శాతం వాటాలుండే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విస్తృత అనుభవం ఉన్న ప్రముఖులు తన భాగస్వాములుగా ఉండనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌, దేశీయ కంపెనీ ఇండిగోలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు తనతో కలిసి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో విమనయాన రంగానికి భారీ డిమాండ్‌ ఉండనున్నట్లు అంచనా వేశారు. 'ఆకాశ ఎయిర్‌లైన్స్‌'గా పిలవబోయే తమ కంపెనీ.. ప్రయాణికులకు అత్యంత చౌకగా విమాన సేవలు అందించనుందన్నారు.


నష్టాల్లో ఉన్నప్పుడు..


సాధారణంగా ఎవరైనా లాభాల్లో ఉన్న మార్కెట్ పై దృష్టి పెడతారు. కానీ రాకేశ్ చాలా భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో విమానయాన రంగం గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావంతో పరిస్థితి మరింత దిగజారింది. విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 2012లోనే తన కార్యకలాపాలకు స్వస్తి పలికింది. కరోనా ఆగమనానికి కొన్ని నెలల ముందే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు నేలకు పరిమితమయ్యాయి. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త విమానాలకు ఇచ్చిన ఆర్డర్లను విస్తారా తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో నష్టాల్లో నడుస్తోంది. కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగానూ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక భారత్‌లో కరోనా మూడో వేవ్‌ రానుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పట్లో విమానసేవలు సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఝున్‌ఝున్‌వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండడం గమనార్హం. తక్కువ ధరతో ప్రయాణికులకు విమాన సేవలు అందిస్తామంటున్న ఆయన 'బిజినెస్‌ మోడల్‌'పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఆయన వెనకడుగు వేస్తారో లేక షేర్ మార్కెట్ లో వేసినట్లు విమానయాన రంగంలోని తనదైన ముద్ర వేస్తారో చూడాలి.