Bhavish Aggarwal:ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్‌కు కృత్రిమ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కూడా ఉంది. ఆ ఏఐ కంపెనీ కోసం నిధులు సేకరిస్తున్నారు. దీని కోసం ఓలా ఎలక్ట్రిక్‌లో ఉన్న తన వాటా 5.88 కోట్ల షేర్లు తాకట్టుపెట్టారు. దీంతో ఇప్పుడు బిజినెస్ సర్కిల్‌లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పటికే కొన్ని షేర్లు తాకట్టు పెట్టారు. ఇప్పుడు మరికొన్నింటిని కూడా తాకట్టు పెట్టారు. దీంతో ఆయన 2.43 శాతానికిపైగా షేర్లు తాకట్టు పెట్టినట్టు అయింది. వీటి విలువ దాదాపు 603 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆయన కంపెనీకి చెందిన ఒక్కో షేర్ ధర 56.40 రూపాయలు ఉంది.
అగర్వాల్ తన షేర్లను అవెండస్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఫండ్ II, అవెండస్ ఫైనాన్స్, ఇన్‌క్రెడ్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ వంటి సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు హామీగా ఉంచారు. అంటే ఈ షేర్లు అగర్వాల్ పేరున ఉన్నప్పటికీ, వాటిని విక్రయించడం లేదా బదిలీ చేయడం వంటివి చేయడానికి లేదు. ఆరు నెలల క్రితం అంటే 2024 డిసెంబర్‌లో 4.83 కోట్ల షేర్లు తొలిసారి తాకట్టుపెట్టారు. ఇప్పుడు రెండోసారి 5.88 కోట్ల షేర్లు తాకట్టు పెట్టారు. తన ఏఐ కంపెనీ కృత్రిమ్ కోసం అగర్వాల్ చేస్తున్న చివరి ప్రయత్నంగా కంపెనీ పత్రాలు చెబుతున్నాయి.
2024లో ఈ కృత్రిమ్ అనే ఏఐ స్టార్టప్‌ను అగర్వాల్ ప్రారంభించారు. దీనికి కృత్రిమ అని అర్థం. పూర్తిగా ఏఐ కంప్యూటింగ్ సిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం 2024లో తొలిసారి 50 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించారు. ఇలా నిధులు సేకరించిన మొదటి ఏఐ యూనికార్న్‌గా నిలించింది. తర్వాత ఫిబ్రవరిలో ఈ కంపెనీలో రెండువేల కోట్లు పెట్టుబడిగా అగర్వాల్ పెట్టారు. ఇలా ఈ కంపెనీలో వచ్చే ఏడాది నాటికి పదివేల కోట్లు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు పెట్టుబడులు పెడుతూనే టెక్నికల్‌గా కూడా ఈ కృత్రిమ ఏఐను డెవలప్ చేస్తున్నారు. యాట్‌బాట్ యాప్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చాట్‌జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి యాప్స్‌తో పోటీ పడుతుంది.
ఓవైపు కృత్రిమ ఏఐ స్టార్టప్‌ను డెవలప్ చేస్తున్న టైంలోనే తన ఓలా ఎలక్ట్రిక్ షేర్లూ పడిపోతూ వస్తున్నాయి. గత ఆగస్టు నుంచి షేర్ల ధరలు పతనమవుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో 76 రూపాయలుగా ఉండే షేర్లు ఇప్పుడు 53.24కి పడిపోయాయి. దాదాపు 30 శాతానికిపైగా పతనమైంది. గరిష్టంగా 157. 53 రూపాయలకు చేరింది. దాంతో ఇప్పుడున్న ధర పోల్చి చూస్తే 66 శాతం నష్టం వచ్చినట్టు లెక్క. గత త్రైమాసికంలో ఈకంపెనీ దాదాపు 870కోట్ల నష్టం నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది దాదాపు 109శాతం కంటే ఎక్కువ. ఆదాయం కూడా భారీగా పడిపోయింది. 1598 కోట్ల నుంచి 611 కోట్లకు తగ్గింది.
దీనికి షేర్ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకులు ఒక కారణం కాగా... మరోవైపు మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పడిపోయింది. 2024మేలో ఈ కంపెనీ వాట మార్కెట్‌లో 49.2 శాతంగా ఉంటే... ఇప్పుడు అది 20 శాతానికి పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్‌లో తన వాటాను తగ్గించుకుండానే షేర్లు తాకట్టుపెట్టి కృత్రిమ్‌కు డబ్బులు సేకరిస్తున్నారు. సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్టార్టప్‌ను డెవలప్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆయన డబ్బులు తిరిగి చెల్లించకుంటే మాత్రం ఆ షేర్లను అప్పులు ఇచ్చిన వాళ్లు అమ్ముకోవచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ షేర్‌పై ప్రభావం చూపనుంది. ధర మరింత పతనం కావచ్చు. ఈ చిక్కుముడిని అగర్వాల్ ఎలా విప్పుతారో అని బిజినెస్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.