Insurance with ATM Card: ఇప్పుడు, ప్రతి వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఒక అవసరం. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఒక డెబిట్ కార్డ్ లేదా ATM (Automated teller machine) ఉంది. భారతదేశ ప్రజల్లో సింహభాగానికి కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా ఉంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్న వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాళ్లందరి దగ్గరా అకౌంట్‌కు ఒకటి చొప్పున పెద్ద సంఖ్యలో ఏటీఎం కార్డులు ఉన్నాయి.
ఏటీఎం కార్డ్ వల్ల ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలు (ATM Card Benifits) అన్నీ ఇన్నీ కావు. బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, దగ్గరలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేయవచ్చు, తీసుకోవచ్చు. దీనివల్ల సమయం, సహనం చాలా ఆదా అవుతాయి. ఏటీఎం కార్డ్‌పైన రుణం కూడా తీసుకోవచ్చు.
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినా, చాలా ఎక్కువ మందికి తెలియని మరొక ప్రయోజనం ATM కార్డ్‌లో దాగుంది. అది ప్రమాద బీమా (Accidental Insurance Cover). ఏటీఎం కార్డులు జారీ చేసిన తొలినాళ్లలో ఇలాంటి సౌకర్యం లేదు, గత కొన్నేళ్లుగా మాత్రమే బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అందువల్లే, ఏటీఎం కార్డ్ నుంచి ఇలాంటి ఫెసిలిటీ పొందవచ్చని ఇప్పటికీ చాలా మందికి తెలీదు.
యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీ
ఒక బ్యాంక్ తన ఖాతాదారుకు ATM కార్డ్‌ను జారీ చేసే సమయంలోనే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీలోకి ఆ ఖాతాదారుని తీసుకు వస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ బ్యాంక్ (HDFC Bank), అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ (State Bank of India) సహా దాదాపు అన్ని బ్యాంకులు తమ ఖాతాదార్లకు ఈ అవకాశాన్ని అదనపు సదుపాయం కింద కల్పిస్తున్నాయి. అయితే, అన్ని బ్యాంకుల ఇన్సూరెన్స్ కవరేజీ ఒకేలా ఉండదు. కార్డ్ ఇచ్చే బ్యాంక్, ఖాతాదారు తీసుకునే డెబిట్/ ATM కార్డ్ రకాన్ని బట్టి బీమా కవరేజీ మారుతుంది. ఈ మొత్తం.. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
ATM కార్డ్ కలిగి ఉన్న కార్డుదారుకి ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన పక్షంలో, ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం, సంబంధింత బ్యాంక్ శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారులు కోరిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ATM కార్డ్ కలిగి ఉన్న ఖాతాదారు ప్రమాదంలో మరణిస్తే.. డెత్ సర్టిఫికెట్, శవపరీక్ష నివేదికను కూడా జత చేయాల్సి ఉంటుంది.
30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా..
డెబిట్ కార్డు బీమా క్లెయిం చేసుకోవాలంటే ఒక షరతు ఉంది. ప్రమాదానికి గురి కావడానికి ముందున్న 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా ఆ ATM కార్డును కార్డుదారు వినియోగించి ఉండాలి. అంటే, ఆ కార్డ్‌ను ఉపయోగించి డబ్బులు వేయడమో, తీయడమో, నగదు నిల్వను తనిఖీ చేయడమో, ఏదైనా కొనడమో, లేదా ఆ కార్డ్ ద్వారా మరో సేవను పొందడమే చేసి ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు 60 రోజులు, మరికొన్ని బ్యాంకుల్లో 90 రోజుల వరకు ఉంది.
ప్రస్తుతం... SBI గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా) ATM కార్డు మీద రూ. 2 లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంది. SBI వీసా సిగ్నేచర్ ATM కార్డు గరిష్ఠంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంది. HDFC బ్యాంక్ ప్లాటినం డెబిట్ కార్డు మీద రూ. 5 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది. ICICI బ్యాంక్ వీసా ప్లాటినం డెబిట్ కార్డు మీద రూ. 50,000 బీమా వస్తుంది. ICICI బ్యాంక్ టైటానియం కార్డు మీద గరిష్టంగా రూ. 10 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది.
ATM కార్డ్ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు ‘పర్చేజ్ ప్రొటెక్షన్’ను కూడా కొన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అంటే, షాపింగ్ చేసేటప్పుడు మీకు తెలీకుండా జరిగిన మోసం వల్ల మీరు నష్టపోతే, సంబంధిత లావాదేవీలపై కూడా మీరు బీమా పొందవచ్చు, జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చుకోవచ్చు.