Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన కింద, సీనియర్‌ సిటిజన్లకు ఆర్థిక భరోసా అందుతుంది. ఇది సామాజిక భద్రత కార్యక్రమం. ఈ పథకం ద్వారా, ప్రజలు తమ వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనం  పొందుతారు. 


నరేంద్ర మోదీ హయాంలో ప్రారంభమై, ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అటల్ పెన్షన్ యోజన ఒక కొత్త మైలురాయిని దాటింది. ఈ పథకంలో చేరిన సభ్యుల సంఖ్య 5 కోట్లు దాటింది. ఇప్పటి వరకు, అటల్ పెన్షన్ యోజనలోకి 5.25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) జ్ఞాపకార్థం, అటల్ పింఛను పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ పెన్షన్ ప్రయోజనం పొందాలనేది APYని ప్రవేశపెట్టడం వెనుకున్న లక్ష్యం. సంఘటిత రంగంలో పని చేస్తున్నవారికి, వారి ఉద్యోగ విరమణ తర్వాత పింఛను అందుతుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి కూడా, వారి వృద్ధ్యాప్యంలో పింఛను అందాలని, ఆర్థిక భద్రత ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.


2022-23 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరుగుదల    
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్త చందాదారుల సంఖ్య 20 శాతం పెరిగింది. ఈ పథకంలో చేరిన పెట్టుబడిదార్లు, ఇప్పటి వరకు 8.92 శాతం రాబడిని పొందారు. ఈ పథకం కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 28,434 కోట్లకు చేరుకుంది.      


పింఛను పథకంలో చేరడానికి అర్హతలు-అనర్హతలు            
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన పెన్షన్ పథకం (Pension Scheme). ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే చిన్నపాటి అర్హతలు ఉండాలి. అలాగే, కొన్ని అనర్హతలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆ వ్యక్తికి పొదుపు ఖాతా (Savings Account) కచ్చితంగా ఉండాలి. అలాగే, ఆధార్ నంబర్ (Aadhar Number), మొబైల్ నంబర్ (Mobile Number) కలిగి ఉండాలి.  అదే సమయంలో, పన్ను చెల్లింపుదారుగా (Tax Payer) ఉండకూడదు. అంటే, ఆదాయ పన్ను చెల్లించేంత సంపాదన సదరు పెట్టుబడిదారుకు ఉంటే, అటల్ పెన్షన్ యోజనకు అతను అనర్హుడు అవుతాడు.


60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి పింఛను   
అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్‌లు తమకు 40 సంవత్సరాలు నిండే వరకు ఈ పథకంలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. వాళ్లకు 60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి పింఛను అందడం ప్రారంభమవుతుంది. నెలవారీ పెన్షన్‌ రూపంలో రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు చేతికి వస్తుంది. పెట్టుబడి కాలంలో ఒక వ్యక్తి పెట్టిన పెట్టుబడి ఆధారంగా పింఛను మొత్తం నిర్ణయిమవుతుంది. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ పింఛను, తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ పింఛను తీసుకుంటారు.