One Crore Rupees Offer: షాపుల నుంచి ఏ వస్తువు కొన్నా, కనీసం 10 రూపాయల ప్రొడక్ట్‌ కొన్నా దానికి సంబంధించి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. మనం కొనే చిన్నపాటి వస్తువు రేటులోనూ వివిధ రకాల టాక్స్‌లు కలిసి ఉంటాయి. అంటే, ప్రతి ప్రొడక్ట్‌ కొనుగోలుపై మనం కచ్చితంగా పన్నులు చెల్లిస్తున్నాం. అయితే, ఆ వస్తువుకు సంబంధించిన బిల్‌ను మనం షాప్‌ నుంచి అడిగి తీసుకోకపోతే కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ వస్తువుపై మనం చెల్లించిన టాక్స్‌లను గవర్నమెంట్‌కు కట్టకుండా, షాపు వాడు తన జేబులో వేసుకునే అవకాశం ఉంది. అంటే, మనం గవర్నమెంట్‌కు టాక్స్‌ కడితే, దాన్ని షాపు వాడు మింగేసే ఛాన్స్‌ ఉంది. రెండోది.. ఒకవేళ ఆ వస్తువు పాడైనా, రిటర్న్‌ చేయాలన్నా కస్టమర్‌ దగ్గర రిసిప్ట్‌ ఉంటే పని సులభంగా పూర్తవుతుంది. రసీదు లేకపోతే, నా దగ్గర ఎప్పుడు కొన్నావంటూ షాపు ఓనర్‌ దబాయించే రిస్క్‌ ఉంటుంది. కాబట్టి, ఏ వస్తువు కొన్నా రిసిప్ట్‌ తీసుకోవడం అన్ని విధాలా మంచిది.


సెంట్రల్‌ గవర్నమెంట్‌ నుంచి కొత్త స్కీమ్‌
ఎంత చిన్న వస్తువు కొన్నా, దానికి సంబంధించిన రిసిప్ట్‌ తీసుకోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ముందు, రసీదు అడగడానికి జనం జంకుతున్నారు. జనంలో బెరుకును పోగొట్టి, రిసిప్ట్‌ అడిగేలా ప్రోత్సహించడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ కొత్త స్కీమ్‌ తీసుకొస్తోంది. ఆ స్కీమ్‌ పేరు "మేరా బిల్‌ మేరా అధికార్‌". 


"మేరా బిల్‌ మేరా అధికార్‌"తో ఏంటి లాభం?
ఇది చాలా సింపుల్‌ స్కీమ్‌. కొనుగోలుకు సంబంధించిన రిసిప్ట్‌ తీసుకుని, దానిని అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయల చొప్పున గెలుచుకునే ఛాన్స్‌ ఉంటుంది. "మేరా బిల్‌ మేరా అధికార్‌" అనేది ఒక లాటరీ పథకం. లాభాపేక్షతో కాకుండా, సదుద్దేశంతో ప్రారంభించిన పథకం ఇది. వచ్చే నెల (సెప్టెంబర్‌) 1వ తేదీ నుంచి ఈ స్కీమ్‌ స్టార్‌ అవుతుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా, సరిగ్గా ఏడాది పాటు కొనసాగుతుంది.  


కోటి రూపాయలు గెలవడం ఎలా?
కోటి రూపాయలు గెలవాలంటే ముందుగా 'డ్రా'కు అర్హత సాధించాలి. ఇదేం పెద్ద విషయం కాదు. ప్రతి నెలలో తీసుకున్న రిసిప్ట్‌ను ఆ తర్వాతి నెల 5వ తేదీ కల్లా అప్‌లోడ్‌ చేస్తే అర్హత పొందినట్లే. "మేరా బిల్‌ మేరా అధికార్‌" మొబైల్‌ యాప్‌ లేదా "www.merabill.gst.gov.in" పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతోపాటు, రిసిప్ట్‌ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలి. ఒక వ్యక్తి ఒక నెలలో 25 రిసిప్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు వీలుంటుంది. GSTN ఉన్న షాపు/సప్లయర్స్‌ నుంచి తీసుకున్న రశీదులను మాత్రమే అప్‌లోడ్‌ చేయాలి. రిసిప్ట్ కనీస విలువను రూ.200గా నిర్ణయించారు.


పోర్టల్‌ లేదా యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన GST రిసిప్ట్స్‌ నుంచి ప్రతి నెలా డ్రా తీస్తారు. ముందుగా 800 రశీదులను ఎంపిక చేసి, ఒక్కో దానికి రూ.10 వేల చొప్పున ప్రైజ్‌ మనీ ఇస్తారు. ఆ తర్వాత మరో 10 రిసిప్ట్స్‌ను తీసి, వాటికి ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తారు. ఇది కాకుండా, ప్రతి 3 నెలలకు ఒకసారి బంపర్‌ డ్రా తీస్తారు. బంపర్‌ డ్రాలో గెలుపొందిన రిసిప్ట్‌కు కోటి రూపాయలు అందజేస్తారు. 


డ్రాలో విజేతగా ఎంపికైన వాళ్లు.. ఎంపికైనట్లుగా సమాచారం వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్‌/ వెబ్‌పోర్టల్‌ ద్వారా తమ పాన్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతా లాంటి అదనపు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఉపయోగించి ఆ విజేతకు బహుమతి మొత్తాన్ని పంపిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది.


పైలెట్‌ ప్రాజెక్ట్‌గా, అసోం, గుజరాత్‌, హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్‌ నగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూలో తొలుత ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial