GST 2.0 Complaints: వస్తువులు & సేవల పన్ను (GST)లో సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. సోమవారం, అక్టోబర్ 29న, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే విలేకరులతో మాట్లాడుతూ, GST 2.0 అమలులోకి వచ్చిన తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)కి సంబంధించి వేలాది ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధి ఖరే విలేకరులకు సమాచారం ఇస్తూ, "GST సంస్కరణల తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)కి దాదాపు 3 వేల ఫిర్యాదులు అందాయి. వీటిపై చర్యలు తీసుకోవడానికి CBIC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్)కి ఫిర్యాదులు పంపిస్తాం."
మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది
ఖరే మాట్లాడుతూ, వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. దీని ద్వారా వస్తువులు &సేవల పన్ను (GST) రేట్లలో కోత వల్ల కలిగే ప్రయోజనాన్ని కస్టమర్‌లకు అందించకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. వినియోగదారులను మోసం చేస్తున్నారు.
మంత్రిత్వ శాఖ AI, చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోంది
ఈ ఫిర్యాదుల గురించి కచ్చితమైన సమాచారం పొందడానికి మంత్రిత్వ శాఖ AI, మరియు చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోందని ఖరే తెలిపారు. రిటైల్ వ్యాపారులు GST రేట్లలో కోత వల్ల కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం లేదని చెప్పారు. దీని కారణంగా ప్రభుత్వం తన పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయవలసి వచ్చింది.
GST సంస్కరణ అంటే ఏమిటి?
భారతదేశంలోని పరోక్ష పన్నుల వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీనిని GST సంస్కరణ అని కూడా పిలుస్తారు. GST సంస్కరణ కింద పన్ను వ్యవస్థను సరళీకృతం చేశారు. ఇందులో కేవలం 2 స్లాబ్‌లు అమలులో ఉంచారు.అవి 5 శాతం& 18 శాతం.
GST సంస్కరణ కింద, మొదట 12 శాతం పన్ను పరిధిలోకి వచ్చే అనేక గృహోపకరణాలను 5 శాతం స్లాబ్‌లోకి తీసుకువచ్చారు. దీనివల్ల రోజువారీ ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గాయి. షాంపూ, సబ్బు, టూత్‌పేస్ట్, బేబీ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తులు చౌకగా మారాయి. అలాగే పొగాకు, సిగరెట్లు, పాపపు వస్తువులపై 40 శాతం పన్ను విధించారు. లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్‌పై విధించే 18 శాతం GSTని కూడా రద్దు చేశారు.