2025 Renault Triber Review: 2019లో మొదటిసారి లాంచ్‌ అయిన రెనాల్ట్ ట్రైబర్‌, సబ్‌-4 మీటర్ సెగ్మెంట్‌లో 7 సీటర్ ఆప్షన్‌తో బాగానే హైలైట్‌ అయింది. మొదటి 30 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడై మంచి మార్కెట్‌ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి డిమాండ్ కొద్దికొద్దిగా తగ్గిపోయింది. రెనాల్ట్ ఇండియాకు ఇది చాలా కీలక మోడల్‌. కాబట్టి, 2019 ట్రైబర్‌ని అప్‌డేట్‌ చేసి, 2025 ఫేస్‌లిఫ్ట్‌ ట్రైబర్‌తో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

డిజైన్‌ & ఇంజినీరింగ్‌

2025 ట్రైబర్ లుక్స్‌ మరింత షార్ప్‌గా మారాయి. కొత్త బోనెట్‌, షార్ప్ లైన్స్‌, కొత్త డైమండ్‌ లోగోతో గ్లాస్‌ బ్లాక్‌ గ్రిల్‌, LED హెడ్‌ల్యాంప్స్‌, LED ఫాగ్‌ల్యాంప్స్‌ SUV తరహా స్టైల్‌ని ఇస్తున్నాయి. కారు వెనుక వైపు కూడా LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త బంపర్‌, ట్రైబర్‌ స్క్రిప్ట్‌తో లుక్ మరింత ఫ్రెష్‌గా ఉంది.

ఇంటీరియర్‌ & కంఫర్ట్‌

ఇంటీరియర్‌లో గ్రే-బీజ్‌ రంగుల కలయికతో కేబిన్‌ మరింత ప్రకాశంగా కనిపిస్తుంది. కొత్త డాష్‌బోర్డ్‌, టాప్‌-మౌంటెడ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, మ్యాట్‌ వుడ్‌ ఫినిష్‌ డిజైన్‌ కేబిన్‌కి స్టైల్ ఇచ్చాయి. స్టోరేజ్‌ స్పేస్‌ చాలా స్మార్ట్‌గా ప్లాన్‌ చేశారు - కూల్డ్‌ స్టోరేజ్‌ బిన్‌, రెండు గ్లోవ్‌బాక్స్‌లు, మొబైల్‌ హోల్డర్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ ఇచ్చారు. ఇవి ఫ్యామిలీ యూజ్‌కి బెస్ట్‌.

స్పేస్‌ విషయానికి వస్తే, రెండో వరుస సీటు చాలా కంఫర్టబుల్‌గా, థై సపోర్ట్‌తో, అడ్జస్టబుల్‌ హెడ్‌రెస్ట్స్‌, AC వెంట్స్‌తో సూపర్‌గా ఉంది. మూడో వరుస సీటులో పిల్లలు కూర్చోవచ్చు. దగ్గరి దూరాలకు వెళ్లినప్పుడు పెద్దవాళ్లు కూడా సర్దుకుని కూర్చోవచ్చు. 7 సీటర్‌గా ఈ సెగ్మెంట్‌లో ఇది రియల్ USP.

ఫీచర్లు & సేఫ్టీ

2025 ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌తో కొత్త ఫీచర్లు వచ్చాయి, అవి - క్రూజ్‌ కంట్రోల్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌. కొత్త UIతో వచ్చిన 8 అంగుళాల స్క్రీన్‌, వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay కనెక్టివిటీ సపోర్ట్‌తో యూత్‌ని ఈజీగా ఆకర్షిస్తుంది.

సేఫ్టీ కోసం - 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్‌, ISOFIX, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌తో ఫుల్ ప్యాకేజీలా అందించారు.

ఇంజిన్‌ & పెర్ఫార్మెన్స్‌

2025 ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న అసంతృప్తి ఇంజిన్‌తోనే. పాత వెర్షన్‌లో ఉపయోగించిన అదే 1.0 లీటర్‌ 3-సిలిండర్‌, 72hp పవర్‌, 96Nm టార్క్‌ ఇంజిన్‌నే ఇచ్చారు. సిటీలో బాగానే హ్యాండిల్‌ చేస్తుంది కానీ హైవేపై & లాంగ్‌ రన్స్‌లోనూ ఇంజిన్‌ కెపాసిటీ తక్కువగా అనిపిస్తుంది. ఫుల్ లోడ్‌లో ఓవర్‌టేక్‌ చేయాలంటే గేర్‌ డౌన్‌ చేయాల్సిందే. AMT ఆప్షన్‌ ఉన్నా, అది టాప్‌ ట్రిమ్‌లో మాత్రమే ఉంది.

రైడ్‌ & మైలేజ్‌

రైడ్‌ క్వాలిటీ మాత్రం బాగుంది. స్పీడ్‌ బ్రేకర్స్‌, బంప్స్‌, గుంతలను ఈజీగా తట్టుకుంటుంది. కానీ స్టీరింగ్‌ చాలా లైట్‌గా ఉండటం వల్ల స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు నమ్మకం కాస్త తగ్గుతుంది. 2025 ట్రైబర్‌ మైలేజ్‌ 19 kmpl (మాన్యువల్‌), 18.2 kmpl (AMT) ARAI క్లెయిమ్‌. CNG ఆప్షన్‌ కూడా డీలర్‌ లెవెల్‌లో లభిస్తుంది.

ధర & వెర్డిక్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో, 2025 రెనాల్ట్ ట్రైబర్ స్టార్టింగ్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5.76 లక్షలు. లుక్స్‌, ఫీచర్లు, స్పేస్‌, ప్రాక్టికాలిటీకి ఈ ధరలో ఇది బెటర్‌. హ్యాచ్‌బ్యాక్‌కి బదులు ఫ్యామిలీకి మంచి ఆప్షన్‌. కానీ పెర్ఫార్మెన్స్‌ ఇంకా అప్‌గ్రేడ్‌ అయితేనే ఇది పూర్తి SUV అనిపిస్తుంది.

మొత్తానికి, బడ్జెట్‌ ఫ్రెండ్లీ 7 సీటర్‌ కావాలనుకునే ఫ్యామిలీస్‌కి రెనాల్ట్ ట్రైబర్ 2025 ఒక వాల్యూ-ఫర్-మనీ ఆప్షన్‌.