Apple Ready To Settle lawsuit In Siri Case: వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించిందన్న ఆరోపణలపై, ఆపిల్‌ (Apple) కంపెనీ, ఐఫోన్‌ (iPhone) యూజర్లకు భారీగా నష్ట పరిహారం చెల్లించబోతోంది. వినియోగదార్లకు తెలీకుండా & వాళ్ల అనుమతి లేకుండా యాపిల్‌ పరికరాల్లో 'సిరి' (Siri)ని రహస్యంగా యాక్టివేట్‌ చేసినట్లు ఆపిల్‌ కంపెనీపై ఐదు సంవత్సరాల క్రితం కోర్టులో కేసు నమోదైంది. ఆ కేస్‌ను సెటిల్‌ చేసుకునేందుకు, ఆపిల్‌ కంపెనీ ఇప్పుడు 95 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 814 కోట్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌ ఫెడరల్ కోర్ట్‌కు సమర్పించింది.


సిరి తెచ్చిన తంటా
ఆపిల్‌కు చెందిన ఐఫోన్లు & మరికొన్ని పరికరాల్లో, వర్చువల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ 'సిరి'ని ఆపిల్‌ ఇన్‌స్టాల్‌ చేసింది. వాస్తవానికి... ఐఫోన్‌ యూజర్‌ 'హే సిరి' (Hey Siri) లేదా 'సిరి' (Siri) లేదా మరేదైనా నిర్దిష్ట కీవర్డ్‌ను పలికినప్పుడు మాత్రమే సిరి యాక్టివేట్‌ కావాలి, యూజర్‌ అడిగిన సమాచారాన్ని వెల్లడించాలి. కానీ, 'హే సిరి' వంటి పదాలను యూజర్‌ పలకపోయినా, అంటే సిరిని యాక్టివేట్‌ చేయకపోయినా దానంతట అదే యాక్టివేట్‌ అవుతోందన్నది ఆపిల్‌ కంపెనీపై వచ్చిన ఆరోపణ. తద్వారా, ఐఫోన్‌ ద్వారా చేసే సంభాణలతో పాటు, ఐఫోన్‌కు దూరంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కూడా సిరి వింటోందని కోర్ట్‌ కేసులో ఆరోపించారు. ఆ మాటలను వ్యాపార ప్రకటనలు జారీ చేసే సంస్థలతో సిరి పంచుకునేదని, తద్వారా, ఆయా కంపెనీలు యూజర్‌ మాటల్లో వినిపించే వస్తువులకు సంబంధించిన ప్రకటనలు ఐఫోన్లలో వచ్చేలా చేసి, వస్తువులు అమ్మేవాళ్లని లా సూట్‌లో పేర్కొన్నారు. వినియోగదార్ల వ్యక్తిగత వ్యక్తిగత గోప్యత (Personal privacy)కు ఇది పూర్తి విరుద్ధమని కోర్ట్‌లో వాదించారు. 


కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆపిల్‌ కంపెనీ గతంలో చాలాసార్లు చెప్పింది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook) కూడా, వ్యక్తిగత గోప్యత కూడా ఒక "ప్రాథమిక హక్కు" అని అనేకసార్లు స్పష్టం చేశారు. కానీ, సిరి వ్యవహారం దీనికి విరుద్ధంగా ఉంది. 


తప్పు అంగీకరించని ఆపిల్‌
ఈ నేపథ్యంలో, పరిహారం ఇచ్చి ఈ కేస్‌ను సెటిల్‌ చేసుకునేందుకు ఆపిల్‌ ప్రతిపాదించింది. విచిత్రం ఏంటంటే... తాము తప్పు చేసినట్లు ఆ సెటిల్‌మెంట్‌ పేపర్లలో ఆపిల్ కంపెనీ అంగీకరించలేదు.


ఆపిల్‌ ప్రతిపాదించిన పరిహారాన్ని న్యాయమూర్తి ఆమోదించాలి. దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించడానికి, ఓక్లాండ్‌ కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.


10 లక్షల మందికి పరిహారం
ఆపిల్‌ సెటిల్‌మెంట్‌కు ఆమోదం లభిస్తే... 2014 సెప్టెంబర్ 17 నుంచి గత సంవత్సరం చివరి వరకు iPhoneలు, ఇతర ఆపిల్‌ పరికరాలు కలిగి ఉన్న దాదాపు 10 లక్షల మంది వినియోగదార్లు క్లెయిమ్‌ కోసం దాఖలు చేయవచ్చు. మొత్తంల క్లెయిమ్‌ల సంఖయను బట్టి చెల్లించే మొ్తాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. సిరి ఫీచర్‌తో ఉన్న డివైజ్‌ కలిగి ఉన్న ప్రతి యూజర్‌ 20 అమెరికన్‌ డాలర్ల వరకు పరిహారం పొందవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులు గరిష్టంగా ఐదు పరికరాలపై పరిహారం పొందవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్‌ - మీ కార్డ్‌ పరిస్థితేంటి?