Foxconn Jobs 2024: ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ పురుషులు-మహిళలకు మధ్య ఉన్న అంతరం రోజురోజుకూ తగ్గిపోతోంది. రక్షణ, స్పేస్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో సైతం మహిళల హవా ఒక పక్క కొనసాగుతుండగా.. మరోపక్క బడా కంపెనీలో మహిళలపై వివక్ష కొనసాగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


చెన్నై ఫాక్స్‌కాన్ యూనిట్‌లో.. 
పెళ్లైన మహిళలను ఉద్యోగంలోకి తీసుకోకపోవడం భారతదేశంలోనే జరగటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అవును ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ కోసం అసెంబ్లింగ్ చేపడుతున్న చెన్నై ఫాక్స్‌కాన్ యూనిట్ లో ఈ వ్యవహారం జరుగుతోంది. వివాహిత మహిళల ఉద్యోగ దరఖాస్తులను కంపెనీ తిరస్కరించటం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఉన్న ఈ ప్లాంట్‌లో వివాహిత మహిళలు పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉంచబడ్డారు. వివక్షత లేని రిక్రూట్‌మెంట్ పట్ల కంపెనీ బహిరంగంగా పేర్కొన్న నిబద్ధతకు ఇది విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. 2023, 2024లో ఆపిల్, ఫాక్స్‌కాన్ రెండూ ఇటువంటి కేసులను ఎదుర్కొన్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. 


పెళ్లైన మహిళలు తిరిగి వెళ్లిపోండి 
చెన్నైలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్షకు తాము గురైనట్లు పార్వతి, జానకి అనే ఇద్దరు పేర్కొన్నారు. 2023లో వాట్సాప్‌లో ఉద్యోగ ప్రకటన చూసి వారు ఇంటర్వ్యూ కోసం ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే గేటు వద్ద ఉన్న సెక్యూరటీ అధికారి పెళ్లైన మహిళలు తిరిగి వెళ్లిపోవాలని సూచించటంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. కంపెనీలో ఇలాంటి అభ్యాసం ఉందని ఫాక్స్‌కాన్ ఇండియా మాజీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎస్.పాల్ కూడా ధృవీకరించారు. వివాహమైన స్త్రీలకు కుటుంబ బాధ్యతలు, గర్భధారణ సంభావ్యత కారణంగా ప్రమాద కారకంగా ఉంటారని ఫాక్స్‌కాన్ విశ్వసిస్తున్నట్లు చెప్పారు. 


S.పాల్ వాదనలను ఫాక్స్‌కాన్ కంపెనీకి చెందిన వివిధ నియామక ఏజెన్సీలకు చెందిన 17 మంది ఉద్యోగులతో పాటు నలుగురు ప్రస్తుతం.. మాజీ హెచ్‌ఆర్ అధికారులు కూడా సమర్థించారు. పెళ్లికాని యువతుల కంటే వివాహిత మహిళలకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయని, వారి పనిపై ప్రభావం పడకుండా రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు దూరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. అలాగే వివాహిత హిందూ మహిళలు ధరించే సాంప్రదాయ ఆభరణాలు, మెట్టెలు, నెక్లెస్‌ల గురించి వారు ఆందోళనలను ఉదహరించారు. వీటి ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ కారణంగా తయారీ ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చని లేదా దొంగతనానికి సంబంధించిన భద్రతా సమస్యలను కలిగిస్తాయని వారు ఆందోళవ వ్యక్తం చేశారు. 


దిద్దుబాటు చర్యల మాటేంటీ ? 
కంపెనీ రిక్రూట్మెంట్ పరిశీలిస్తే అత్యధిక ఉత్పత్తి జరిగిన సమయంలో కంపెనీ వివాహిత స్త్రీలను ఉద్యోగాల్లో నియమించుకోవడం తెలిసిందే. పెళ్లి చేసుకున్న మహిళలకు ఉద్యోగాలు కల్పించటం లేదని వచ్చిన ఆరోపణలపై ఆపిల్, ఫాక్స్‌కాన్ 2022లో స్పందిస్తూ తమ నియామక పద్ధతుల్లో లోపాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాయి. 


భారతీయ చట్టాలు వైవాహిక స్థితి ఆధారంగా ఉద్యోగ కల్పనలో వివక్షను స్పష్టంగా నిషేధించనప్పటికీ.. ఆపిల్, ఫాక్స్‌కాన్ ప్రవర్తనా నియమావళి అటువంటి పద్ధతులను నిషేధించాయి. ఆపిల్ పరిశ్రమలో అత్యధిక సరఫరా గొలుసు ప్రమాణాలను నిర్వహిస్తుందని వెల్లడించింది. అలాగే భారతదేశంలో కొంతమంది వివాహిత మహిళలను ఫాక్స్‌కాన్ నియమించుకున్నట్లు పేర్కొంది.