Apple iPhone Fined: జానెడు మిగిలిద్దామని చూసి, బారెడు పోగొట్టుకోబోతోంది ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్‌ (Apple). పర్యావరణ పరిరక్షణ సాకుతో, ఛార్జర్లు ఇవ్వకుండా ఐఫోన్లు (iPhones) అమ్మినందుకు 20 మిలియన్ డాలర్ల జరిమానాను ఈ కంపెనీ కట్టబోతోంది.


ఐఫోన్లతోపాటు ఛార్జర్లు, హెడ్‌సెట్‌లు ఇవ్వనందుకు బ్రెజిల్‌లోని సావో పౌలో సివిల్‌ కోర్టు 100 మిలియన్ రియాస్‌ల (20 మిలియన్‌ డాలర్లు లేదా 165 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. మొదటి వస్తువును కొన్నందుకు రెండో వస్తువును కూడా కూడా కొనేలా వినియోగదారులను బలవంతం చేసే "దుర్వినియోగ పద్ధతి"గా ఆపిల్‌ చర్యను కోర్టు ఆక్షేపించింది. అంతేకాదు, బ్రెజిల్‌లో ఛార్జర్లు, హెడ్‌ఫోన్లు లేకుండా ఐఫోన్లను కొన్నవాళ్లందరినీ వెతికి పట్టుకుని, వాళ్లందరికీ ఆయా పరికరాలను ఉచితంగా అందించాలని కూడా ఆదేశించింది. 


ఛార్జర్‌ విడిగా కొనాలా?
కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతోనే తాము ఛార్జర్లు, హెడ్‌ఫోన్లు లేకుండా ఐఫోన్లు అమ్ముతున్నామ ఆపిల్‌ కోర్టులో వాదించింది. ఆ వాదన మీద న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. "గతంలో అమ్మిన ఐఫోన్లకు ఛార్జర్లు అందిచారుగా, ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు. ఐఫోన్‌ కొన్నవాళ్లు ఛార్జర్‌ను మళ్లీ విడిగా కొనాలన్నదేగా మీ ఉద్దేశం. మీ అమ్మకాలు పెంచుకోవడానికి వినియోగదారులు మీద ఆర్థిక భారం వేస్తారా?, ఇది సరైన పద్ధతి కాదు" అని కోర్టు పేర్కొంది. 


కోర్టు ఆదేశం ప్రకారం ఆపిల్‌ ఇటు ఫైన్‌ కట్టాలి, అటు.. ఇప్పటికే ఐఫోన్లు కొన్నవాళ్లందరికీ వాటిని ఫ్రీగా అందించాల్సి ఉంటుంది. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది దాని పరిస్థితి. 


అయితే, సావో పౌలో సివిల్‌ కోర్టు ఆదేశంపై తాము పైకోర్టులో అప్పీల్‌ చేస్తామని ఆపిల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.


గతంలోనూ ఫైన్‌
2020 అక్టోబర్‌లో, అప్పుడు వచ్చిన కొత్త ఐఫోన్లతోపాటు ఔట్‌లెట్‌ ఛార్జర్‌లను ఇవ్వడం ఆపిల్ ఆపేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడంలో కంపెనీ సాయం చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఐఫోన్‌తోపాటు ఛార్జర్‌ ఇవ్వనందుకు జనాగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆపిల్‌ నిర్ణయం మీద బ్రెజిల్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఛార్జర్‌ లేకుండా ఐఫోన్లు అమ్ముతోందని, బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌లో ఆపిల్‌కు దాదాపు 2.5 మిలియన్‌ డాలర్ల ప్రత్యేక జరిమానా విధించింది. అంతేకాదు, iPhone 12, 13 మోడళ్లను ఛార్జర్‌లు లేకుండా విక్రయించకుండా నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయం మీద సావో పాలో సివిల్ కోర్టులో ఆపిల్‌ అప్పీల్ చేసి, అక్కడ కూడా మొట్టికాయలు గట్టిగా వేయించుకుంది.


స్పెషల్‌ ఛార్జర్‌ వల్లే వివాదం
ఐరోపా సమాఖ్యతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు మొబైల్‌ ఫోన్లలో USB-C (C టైప్‌) ఛార్జింగ్‌ పోర్ట్‌ను తప్పనిసరి చేశాయి. మన దేశంలోనూ ఇప్పుడొచ్చే అన్ని స్మార్ట్‌ ఫోన్లూ C టైప్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌తోనే వస్తున్నాయి. C టైప్‌ ఛార్జర్‌ మన దగ్గర ఉంటే చాలు, మొబైల్‌ కంపెనీతో సంబంధం లేకుండా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. అయితే, ఆపిల్‌ విషయంలో ఇది కుదరదు. ఈ కంపెనీ ఇప్పటికీ తన సొంత పోర్టునే ఫోన్లలో ఉపయోగిస్తోంది. కాబట్టి, ఆపిల్‌ ఛార్జర్లతోనే ఐఫోన్లను ఛార్జ్‌ చేయగలం. ఈ విషయంలోనే ఆపిల్‌ చిక్కులు ఎదుర్కొంటోంది.