Another attack from America on Adani Group: అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఓ సారి అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసింది. చివరికి అవి తప్పని తేలింది. మరోసారి అదానిపై నేరుగా లంచం ఆరోపణల కింద కేసులు పెట్టారు. ఇప్పుడు అమెరికన్ మీడియా మరోసారి అదానీ గ్రూప్ ను టార్గెట్ చేసింది. ఆ సంస్థలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎల్ఐసీ తీవ్రంగా ఖండించింది.
వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే ?
అమెరికాలోని ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' భారత ప్రభుత్వ అధికారులు గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా సుమారు 3.9 బిలియన్ డాలర్ల ( రూ 32,800 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టారని ఆరోపించింది. ముఖ్యంగా 2024లో అమెరికాలో అదానీపై మోసం , లంచం కేసులు నమోదు అయిన తర్వాత అతని వ్యాపారాలు ఆర్థిక ఒత్తిడికి గురైన సమయంలో ఇది జరిగిందని కథనం వివరించింది. ఆ సమయంలోఅమెరికన్ , యూరోపియన్ బ్యాంకులు అతనికి రుణాలు ఇవ్వడం ఆపేసాయి. దీంతో అదానీ గ్రూప్ ఇక్కట్లలో పడింది.
ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు LICకి చెందిన సుమారు 3.4 బిలియన్ డాలర్ల బాండ్ పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని అదానీ గ్రూప్‌లోని రెండు సబ్సిడరీ సంస్థల వైపు మళ్లించాలని మే 2025లో ఒక ప్రతిపాదనను త్వరగా ఆమోదించారు. ఈ ప్రణాళికను సీనియర్ ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. 2023లో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు పడిపోయినప్పటికీ LIC పెట్టుబడులు కొనసాగించడం దీనికి సంకేతమని చెప్పుకొచ్చింది.
తీవ్రంగా ఖండించిన ఎల్ఐసీ
ఈ కథనంపై అక్టోబర్ 25, 2025న LIC అధికారిక ప్రకటన విడుదల చేసింది. "వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు తప్పు.. ఆధారాల్లేని పూర్తిగా అసత్యం" అని స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ చెప్పినట్టు అదా నీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడనికి డాక్యుమెంట్ లేదా ప్లాన్ LIC రూపొందించలేదు. అలాంటి రోడ్‌మ్యాప్ ఎప్పుడూ తయారు కాలేదు. LIC పెట్టుబడులు పూర్తిగా స్వతంత్రంగా, బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం, వివరణాత్మక పరిశీలన తర్వాత తీసుకుంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లేదా ఏ ప్రభుత్వ సంసథా పాత్ర లేదు. LIC అధిక డ్యూ డిలిజెన్స్ ప్రమాణాలను పాటిస్తుంది, అన్ని నిర్ణయాలు చట్టాలు, నిబంధనలు, పాలసీలకు అనుగుణంగా ఉంటాయి. అని స్పష్టం చేశారు. ఈ కథనం LIC నిర్ణయాల ప్రక్రియను దెబ్బతీసి, LIC మరియు భారత ఆర్థిక రంగం పేరుకు మచ్చ తెచ్చే ఉద్దేశ్యంతో రాశారని LIC ఆరోపించింది.LIC ఈ పెట్టుబడులు 2023 హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత కూడా రిస్క్ లిమిట్లలో ఉంచి, లాభదాయకంగా ఉంచామని చెప్పింది.