Amber Enterprises India Share Price: ఇవాళ (బుధవారం 17 మే 2023) స్టాక్‌ మార్కెట్‌లో పరిస్థితి బాగోలేకపోయినా, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు మాత్రం రాకెట్లలా దూసుకెళ్లాయి. 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభంలో ఏకంగా 82% పెరిగి రూ. 108 కోట్లకు చేరుకోవడంతో ఇన్వెస్టర్ల ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. BSEలో, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా షేర్లు 17.5% ర్యాలీ చేసి రూ. 2,222కి చేరుకున్నాయి. ఈ కంపెనీ, ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో రూ. 59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.


సమీక్ష కాల త్రైమాసికంలో అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆదాయం 38% పెరిగి రూ. 3,003 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 1,937 కోట్లుగా ఉంది. కంపెనీ ఎబిటా Q4FY23లో రూ. 204 కోట్లుగా ఉంది, Q4FY22లో నమోదైన రూ. 133 కోట్లతో పోలిస్తే 54% పెరిగింది. 


మొత్తం 2022-23 కాలంలో గణాంకాలు
మొత్తం ఆర్థిక సంవత్సరంలో, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 6,927 కోట్ల ఆదాయం సంపాదించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 65% వృద్ధిని సాధించింది. మొత్తంలో FY23లో కంపెనీ పెట్టుబడి వ్యయం రూ. 698 కోట్లుగా ఉంది.


2018లో ఐపీఓ ప్రారంభించిన అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, RAC ప్లేయర్ నుంచి డైవర్సిఫైడ్ B2B సొల్యూషన్ ప్రొవైడర్‌గా ఎదిగింది.


FY22లో 11%గా ఉన్న ROCE, FY23లో 15%కి మెరుగుపడిందని అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ & CEO జస్బీర్‌ సింగ్‌ చెప్పారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇది 19% నుంచి 21%కు చేరుకుంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.


ప్రైస్‌ యాక్షన్‌
మధ్యాహ్నం 12.30 గంటలకు, BSEలో, ఈ స్క్రిప్ 10.51% పెరిగి రూ. 2,079 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 11% లాభపడింది. గత నెల రోజుల కాలంలో దాదాపు 12% పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 3% రిటర్న్‌ ఇచ్చింది. అయితే, గత ఒక ఏడాది కాలంలో ఈ కౌంటర్‌ 22% పైగా నష్టాలను మూటగట్టుకుంది.


ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్‌ రూ. 2,486. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి మరో 19% పెరుగుదల అవకాశాన్ని ఇది చూపుతోంది.


ఈ స్టాక్‌ను ట్రాక్‌ చేస్తున్న మొత్తం 17 మంది ఎనలిస్ట్‌ల్లో 16 మంది ఏకాభిప్రాయంతో "బయ్‌" రేటింగ్‌ ఇచ్చారు. వీరిలో 11 మంది "స్ట్రాంగ్‌ బయ్‌", ఐదుగురు "హోల్డ్‌" సిఫార్సు చేశారు. మిగిలిన ఒక ఎనలిస్ట్‌ "స్ట్రాంగ్‌ సెల్‌" సిగ్నల్‌ ఇచ్చారు.


టెక్నికల్‌గా చూస్తే, RSI 55.7 వద్ద ఉంది. 30 కంటే తక్కువ RSIలో ఉంటే ఓవర్‌సోల్డ్‌గా, 70 కంటే ఎక్కువ ఉంటే ఓవర్‌బాట్‌గా పరిగణిస్తారు. MACD -9.6 వద్ద, సెంటర్‌ లైన్‌ కింద ఉంది. ఇది బేరిష్ ఇండికేటర్‌.


ఇది కూడా చదవండి: EMIల భారం నుంచి ఇకపై ఉపశమనం, మీ జేబులో డబ్బులు మిగలొచ్చు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.