Hurun India 500: ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd- RIL) విలువ, పరపతి ఎవరెస్ట్ శిఖరంలా, ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతోంది. దేశంలోని అత్యంత విలువైన 500 కంపెనీల లిస్ట్‌లో రిలయన్స్ టాప్-1 గా నిలించింది. హురున్ ఇండియా, బర్గండీ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ బిజినెస్ వింగ్ కలిసి పరిశోధించి, ఈ లిస్ట్ రూపొందించాయి. ‘2022 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ పేరిట ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేశాయి.
విచిత్రం ఏంటంటే... ఈ లిస్ట్‌లో ముఖేష్ అంబానీ (రిలయన్స్) నంబర్.1 గా కొనసాగుతుంటే, గౌతమ్ అదానీకి 9, 10 స్థానాలు (అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్) మాత్రమే దక్కాయి.
పెరిగిన రిలయన్స్ విలువ
గత ఏడాదితో పోలిస్తే RIL విలువ 3.6 శాతం పెరిగి రూ. 17.2 లక్షల కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విలువ 10.8 శాతం తగ్గినప్పటికీ రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ విలువ రూ. 11.6 లక్షల కోట్లు. HDFC బ్యాంక్ రూ. 8.3 లక్షల కోట్లతో థర్డ్ ప్లేస్‌లో ఉంది.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ రూ. 6.4 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, రూ. 6.3 లక్షల కోట్లతో ICICI బ్యాంక్ ఫిఫ్త్ స్పాట్‌లో ఉంది.
టాప్ 10 లో మిగిలిన 5 కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్ (విలువ రూ. 4.8 లక్షల కోట్లు), HDFC (విలువ రూ. 4.4 లక్షల కోట్లు), ITC (విలువ రూ. 4.3 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (విలువ రూ. 3.9 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (విలువ రూ. 3.8 లక్షల కోట్లు).
టాప్-10 కంపెనీలే రారాజులు
టాప్ 10 కంపెనీల మొత్తం విలువ రూ. 72 లక్షల కోట్లు (872 బిలియన్ డాలర్లు). భారతదేశ GDPలో ఇది 37 శాతానికి సమానం. 2022 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ కంపెనీల మొత్తం విలువలో 31 శాతానికి సమానం" అని నివేదిక పేర్కొంది.
టాప్ 10 కంపెనీల మొత్తం విలువ గత పది సంవత్సరాల్లోనే రెండున్నర రెట్లకు పైగా (262%) పెరిగింది. ఇదంతా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీల లెక్క.
అన్ లిస్టెడ్ కేగిరీలో...
అత్యంత విలువైన అన్ లిస్టెడ్ కంపెనీగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (రూ. 2.1 లక్షల కోట్లు) నిలిచింది. బైజూస్ (విలువ రూ. 1.82 లక్షల కోట్లు), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (విలువ రూ. 1.3 లక్షల కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రూ. 6,000 కోట్ల (725 మిలియన్ డాలర్లు) విలువ కంటే పైన ఉన్న కంపెనీలను మాత్రమే ఈ లిస్ట్‌లోకి తీసుకున్నారు
3 నగరాల నుంచే సగానికి పైగా కంపెనీలు
ఈ జాబితాలో మొత్తం 36 నగరాలు ఉండగా... ముంబై (159 కంపెనీలు) లీడ్‌లో ఉంది. బెంగళూరు (63 కంపెనీలు), న్యూదిల్లీ (42 కంపెనీలు) 2, 3 ప్లేసుల్లో ఉన్నాయి. ‘2022 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా ఈ మూడు నగరాల్లోనే ఉన్నాయి.
'2021 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500' రిపోర్ట్‌తో పోలిస్తే, ప్రస్తుత లిస్ట్‌లో ముంబై నుంచి 8 కంపెనీలు తగ్గాయి. బెంగళూరు, న్యూదిల్లీ తలో 11 కంపెనీలను అదనంగా చేర్చాయి.
2022 జాబితాలో 15 శాతం లేదా 73 కంపెనీలు ఆర్థిక సేవల రంగం (ఫైనాన్షియల్ సర్వీసెస్) నుంచే ఉండడం విశేషం. ఈ సెక్టార్‌ది లిస్ట్‌లో టాప్ ప్లేస్. హెల్త్ కేర్ సెక్టార్ నుంచి 60 సంస్థలు, కెమికల్స్ నుంచి 37 కంపెనీలు, కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో 37 కంపెనీలు లిస్ట్‌లో చోటు సంపాదించాయి.
గత ఏడాది లిస్ట్‌లో ఉన్న కంపెనీలు దాదాపు 3.9 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాయని ఈ నివేదిక వెల్లడించింది.