Air India Special Offers For Students: విద్యార్థులు తమ చదువుల కోసం వేరే ప్రాంతాలకు, రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్తుంటారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులు కార్లు, రైళ్లు, బస్సులతో పాటు విమానాల్లోనూ ప్రయాణిస్తుంటారు. ఇక, విదేశీయానం అంటే విమానం తప్పనిసరి. విద్య కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం, విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.


ఎయిర్‌ ఇండియా స్పెషల్‌ ఆఫర్స్‌
ఎయిర్‌ ఇండియా విమానాల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే విద్యార్థులకు ఈ స్పెషల్‌ ఆఫర్లు వర్తిస్తాయి. వీటిలో... టిక్కెట్లపై తగ్గింపు సహా మరికొన్ని అదనపు బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా విమానంలో టిక్కెట్‌ బుక్‌ చేసిన విద్యార్ధికి, ఛార్జీపై 10% వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. మన దేశంలో 49 నగరాలకు, విదేశాల్లో 42 డెస్టినేషన్స్‌కు ఎయిర్‌ ఇండియా విమానాలు ఎగురుతున్నాయి. విదేశీ మార్గాల్లో... US, కెనడా, UK, ఆస్ట్రేలియా సహా మరికొన్ని దేశాలకు వెళ్లే విద్యార్థులు డిస్కౌంట్‌ పొందొచ్చు. అంతేకాదు, అనుమతించిన పరిమితి కంటే అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లొచ్చు. ఎయిర్‌ ఇండియా మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసిన స్టుడెంట్స్‌కు ఈ స్పెషల్‌ ఆఫర్స్‌ వర్తిస్తాయి. అవసరమైతే, ప్రయాణ తేదీని ఒకసారి 'పూర్తి ఉచితం'గా మార్చుకునే వెసులుబాటును కూడా ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.


ఏయే క్లాస్‌లకు ఆఫర్లు వర్తిస్తాయి?
ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌ క్లాస్‌ల్లో ప్రయాణానికి టిక్కెట్లు బుక్‌ చేసే విద్యార్థులకు ఈ స్పెషల్‌ ఆఫర్లు వర్తిస్తాయి. 


ఇప్పటికే చాలా ప్రయోజనాలు
ఎయిర్‌ ఇండియా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్‌ కొన్నవాళ్ల నుంచి ఈ విమానయాన సంస్థ ఇప్పటికే ఎటువంటి బుకింగ్‌ ఛార్జ్ తీసుకోవడం లేదు. ఫలితంగా, విద్యార్థులు డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్‌లో రూ.399, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ బుకింగ్‌లో రూ.999 వరకు ఆదా చేసుకుంటున్నారు. ఎయిర్‌ ఇండియా కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌లతో పాటు UPI, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపు చేసినవాళ్లు ఇంకొంత డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ఈ మొత్తం ఆఫర్లు కలిపితే... టిక్కెట్‌ బేస్‌ ఫేర్‌ మీద విద్యార్థులు 25% వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.


ఎయిర్‌ ఇండియా లాయల్టీ ప్రోగ్రామ్‌ "మహారాజా క్లబ్‌" (Air India's Maharaja Club)లో కూడా విద్యార్థులు నమోదు కావచ్చు. ఈ క్లబ్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకున్నవాళ్లకు ప్రతి ట్రిప్‌లో రివార్డ్‌ పాయింట్లు (Air India Reward Points) వస్తాయి. వివిధ సందర్భాల కోసం వాటిని రెడీమ్‌ చేసుకోవచ్చు. మహారాజా క్లబ్‌ మెంబర్‌ ఎయిర్‌ఇండియా వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేస్తే 33% వరకు అడిషనల్‌ రివార్డ్‌ పాయింట్లు పొందుతాడు.


స్పెషల్‌ ఆఫర్లు పొందడానికి విద్యార్థికి ఉండాల్సిన అర్హతలు
ప్రయాణం రోజు నాటికి, విద్యార్థికి కనీసం 12 సంవత్సరాల వయస్సు ఉండాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థుల వయస్సు, ప్రయాణం రోజు నాటికి, 12-30 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో కనీసం ఒక ఏడాది కోర్సులో చేరి ఉండాలి. విద్యార్థి చదువుతున్న సంస్థ (స్కూల్‌, కాలేజీ, యూనివర్శిటీ లేదా చెల్లుబాటు అయ్యే స్టుడెంట్‌ వీసా లేదా ఐడీ కార్డ్‌) నుంచి తీసుకున్న అంగీకార పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి.


మరో ఆసక్తికర కథనం: స్వయం శక్తితో ఎదిగిన ఇండియన్‌ సూపర్‌మ్యాన్‌లు - టాప్‌ 10లో ఎవరున్నారంటే?