గతేడాది టాటా సంస్థ చేతికి వెళ్లిన ఎయిర్ ఇండియా కంపెనీ తన కొత్త లోగోను గురువారం (ఆగస్టు 10) ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన లైవ్ ఈవెంట్‌లో ఈ కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇది ఎయిర్‌లైన్ కొత్త ఐడెంటిటీ, రీబ్రాండింగ్‌లో భాగమని అన్నారు. ‘అవధుల్లేని అవకాశాలు’ను ఈ లోగో ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణం మొదలైందని చెప్పారు
కొత్త లోగో ఎలా ఉందంటే
ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబల్ కు ‘ది విస్టా’ అని పేరు పెట్టారు. ఈ లోగోలో గోల్డెన్, రెడ్, పర్పుల్ కలర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. వచ్చే 15 నెలలల్లో అత్యుత్తమ అనుభవం, సాంకేతికత, కస్టమర్ సర్వీస్, సేవలతో ఎయిర్ ఇండియాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. గత 12 నెలల్లో, తాము అన్ని విషయాల్లోనూ సంస్థను మెరుగు పరిచామని అన్నారు.
‘‘కొత్త లోగో డిసెంబర్ 2023 నుండి విమానాలలో కనిపిస్తుంది. కొత్త లోగో ఎయిర్ ఇండియా ఉపయోగించే క్లాసిక్, ఐకానిక్ ఇండియన్ విండో నుండి ప్రేరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఉండాలన్న ఎయిర్ ఇండియా ఆశయాన్ని ఈ కొత్త బ్రాండ్ ప్రతిబింబిస్తుంది. ఎయిర్ ఇండియా ప్రయాణికులు డిసెంబర్ 2023 నుండి విమానాలలో కొత్త లోగోను చూస్తారు’’ అని చంద్రశేఖరన్ తెలిపారు.
గత 12 నెలలుగా ఎయిర్ ఇండియా కోసం మెరుగైన టీమ్ ను ఏర్పాటు చేశామని, ఎయిర్‌లైన్స్ ఉద్యోగులందరినీ అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. ఎయిర్ ఇండియా ఫ్లీట్ ను కూడా గ్లోబల్ స్టాండర్డ్‌గా తయారు చేసేలా మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని అన్నారు.
ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. ఈ కొత్త బ్రాండ్ లోగో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే గ్లోబల్ ఎయిర్ లైన్‌గా ఉండాలనే ఎయిర్ ఇండియా ఆశయాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఫ్యూచర్ బ్రాండ్ సహకారంతో కొత్త లోగో రూపొందించామని, ఎయిర్ ఇండియా మొదటి ఎయిర్‌బస్ A350 విమానం కొత్త లోగోతో వస్తుందని అన్నారు. ఆ విమానం తమ ఫ్లీట్ లో డిసెంబర్ 2023లో చేరుతుందని, అప్పటి నుంచి ఎయిర్ ఇండియా ప్రయాణికులు విమానాలపై ఈ కొత్త లోగోను చూస్తారని అన్నారు.