Low Cost Flight Ticket: భారతదేశం, చంద్రుడి దక్షిణ దృవంపై కాలు మోపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చందమామపైకి మానవసహిత యాత్రను కూడా తలపెట్టింది. విచిత్రం ఏంటంటే.. భారతీయులు చందమామను అందుకున్నారుగానీ, విమానంలో మాత్రం తిరగలేకపోతున్నాం. ఇప్పటికీ, జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలన్నది సగటు భారతీయుడి కలగా మిగిలింది. ఆ కలను నిజం చేసుకునే సమయం ఇప్పుడు వచ్చింది.


'టైమ్ టు ట్రావెల్' ఆఫర్‌
వేసవి సెలవులు ముగుస్తుండడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు పుంజుకున్నాయి. ఈ రష్‌ను క్యాష్‌ చేసుకోవడానికి, తన పాసెంజర్ల కోసం 'టైమ్ టు ట్రావెల్' ఆఫర్‌ను (Time to Travel offer) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) లాంచ్‌ చేసింది. ఈ ఆఫర్‌లో, ప్రయాణీకులు బస్‌ ఛార్జీ కన్నా తక్కువ ధరకే విమానం టిక్కెట్‌ బుక్ చేసుకోవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్‌. 2024 మే 29 నుంచి ప్రారంభమైన ఆఫర్‌ జూన్ 03 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే, ప్రయాణీకులు ఈ తేదీల్లోనే ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఈ తేదీల్లో టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ప్రయాణించొచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్, యాప్, ఇతర బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా టిక్కెట్లను యాక్సెస్ చేయవచ్చు.


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లాంచ్‌ చేసిన 'టైమ్ టు ట్రావెల్' ఆఫర్‌ కింద, నేరుగా సంస్థ వెబ్‌సైట్‌ (airindiaexpress.com) నుంచి కేవలం రూ. 1,177 కే టిక్కెట్‌ బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఏజెంట్‌ ద్వారా బుక్‌ చేస్తే రూ. 1,198 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే వాళ్లకు మాత్రమే ఈ ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. అంతేకాదు, ప్రయాణికులు ఎలాంటి ఛార్జీలు లేకుండా అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీంతోపాటు, చెక్-ఇన్ బ్యాగేజీకి డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు. చెక్-ఇన్ బ్యాగేజీ రేట్లు దేశీయ విమానాలకు రూ. 1000 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ. 1,300 నుంచి మొదలవుతాయి.


ముందుగా నమోదు చేసుకుంటే... వేడి భోజనం, ఇష్టపడే సీటింగ్‌పై 25% అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. టాటా న్యూపాస్‌ రివార్డ్స్ ప్రోగ్రామ్ ‍‍(Tata NeuPass Rewards Program‌) మెంబర్లకు భోజనం, సీటింగ్, బ్యాగేజీ, టిక్కెట్‌ రద్దు విషయాల్లో ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు 8% NeuCoins వరకు సంపాదించొచ్చు. ఈ ప్రత్యేక ఛార్జీలను విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, SMEలు, డిపెండెంట్‌లు, సాయుధ దళాల సభ్యులు ఎయిర్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పొందొచ్చు.


మరోవైపు... ఇండిగో (Indigo) కూడా వేసవి సీజన్ కోసం ప్రత్యేక సమ్మర్ సేల్‌ ప్రారంభించింది. దాని పేరు 'హలో సమ్మర్'. ఇందులో భాగంగా కేవలం రూ. 1,199కే విమానం టిక్కెట్‌ అందించింది. అయితే ఈ సేల్‌ ఇప్పుడు అందాబాటులో లేదు. కేవలం మూడు రోజులు మాత్రమే ఓపెన్‌లో ఉండి, మే 31తో ముగిసింది. ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వ్యక్తులు జులై 01 - సెప్టెంబర్ 30, 2024 మధ్య ప్రయాణించొచ్చు.


మహిళల కోసం ప్రత్యేక సౌకర్యం
మహిళా ప్రయాణీకుల సౌకర్యం కోసం, సీట్ల ఎంపికలో కొత్త ఫీచర్‌ జోడించింది ఇండిగో. ఇప్పటికే ఒక మహిళ బుక్‌ చేసుకున్న సీట్‌ పక్కనే ఉన్న సీట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకు లభిస్తుంది. వెబ్ చెక్-ఇన్ చేస్తున్నప్పుడు, మహిళలు బుక్ చేసిన సీటు కనిపిస్తుంది. మహిళల భద్రత & సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో ఈ చర్య తీసుకుంది.


మరో ఆసక్తికర కథనం: ఈపీఎఫ్‌వో నుంచి భారీ ఉపశమనం - చెక్ బుక్, పాస్‌బుక్ లేకపోయినా క్లెయిమ్‌ చేయొచ్చు