Adani vs Hindenburg: అదానీ గ్రూప్‌-హిండెన్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో దాఖలైన వ్యాజ్యాలపై (PILs) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడిదార్ల సంపద ఆవిరి కావడంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే (AM Sapre) నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గురువారం (02 మార్చి 2023) ఆదేశించింది. బాంబే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జె.పి.దేవధర్‌ (JP Devdhar),  ప్రముఖ న్యాయవాది, సెక్యూరిటీస్‌, రెగ్యులేటరీ నిపుణుడు సోమశేఖరన్‌ సుందరేశన్‌ (Somasekharan Sundaresan), బ్రిక్స్‌ దేశాల న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు మాజీ అధిపతి కె.వి.కామత్‌ (KV Kamath), ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ అధ్యక్షుడు నందన్‌ నీలేకని (Nandan Nilekani), ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ సంస్థల డైరెక్టర్‌ ఒ.పి.భట్‌ (OP Bhat), ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన 'మోసం ఆరోపణల'తో జరిగిన అదానీ గ్రూప్ షేర్ల క్రాష్‌పై రెండు నెలల్లోగా విచారణను ముగించాలని సెబీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ ప్యానెల్‌కు అన్ని విధాలా సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక చట్టబద్ధ సంస్థలు, సెబీ చైర్‌పర్సన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.


సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, కమిటీ ఈ 4 విషయాలపై దర్యాప్తు చేస్తుంది:


1) ఇటీవలి కాలంలో సెక్యూరిటీల మార్కెట్‌లో అస్థిరతకు దారితీసిన కారణాలు సహా మొత్తం పరిస్థితిపై అంచనాను అందించడం.


2) పెట్టుబడిదారుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు సూచించడం


3) అదానీ గ్రూప్ లేదా ఇతర కంపెనీలకు సంబంధించి, సెక్యూరిటీస్ మార్కెట్‌ చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై స్పందించడంలో రెగ్యులేటరీ వైఫల్యం ఉందా అనే అంశంపై దర్యాప్తు చేయడం.


4) (i) చట్టబద్ధమైన/ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి (ii) పెట్టుబడిదార్ల రక్షణ కోసం ఇప్పటికే ఉన్న విధానాలను సురక్షితంగా ఉంచే చర్యలను సూచించడం.


"ఇటీవలి కాలంలో కనిపించిన స్టాక్‌ మార్కెట్‌ అస్థిరత నుంచి భారతీయ పెట్టుబడిదార్లను రక్షించడానికి, ప్రస్తుత నియంత్రణ విధానాలను అంచనా వేయడానికి, వాటిని బలోపేతం చేయడానికి సిఫార్సులు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం సముచితమని మేం భావిస్తున్నాం" అని CJI తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ వివాదంలో సెబీ ఇప్పటికే చేపట్టిన విచారణను కొనసాగించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. దీంతోపాటు, పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఈ కింది 3 అంశాలపైనా దర్యాప్తు చేయాల్సిందిగా రెగ్యులేటర్‌ని ఆదేశించింది:


1) సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) రూల్స్ 1957లోని రూల్ 19A ఉల్లంఘన జరిగిందా? (ఒక లిస్టెడ్‌ కంపెనీలో కనీసం 25% పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ ఉండాలన్నదానికి ఈ నియమం సంబంధించింది).


2) సంబంధిత పార్టీలతో లావాదేవీల గురించి, సంబంధిత పార్టీలకు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారాన్ని అదానీ గ్రూప్‌ చట్ట ప్రకారం సెబీకి వెల్లడించలేదా?


3) ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా స్టాక్ ధరల్లో ఏదైనా తారుమారు జరిగిందా?


2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత నెల రోజుల్లోనే, అదానీ గ్రూప్‌ స్టాక్‌ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పైగా తగ్గింది, పెట్టుబడిదార్లు దాదాపు రూ. 12 లక్షల కోట్లు నష్టపోయారు. అదానీ కంపెనీలకు అప్పులు ఇచ్చిన కారణంగా బ్యాంక్ స్టాక్స్‌, LIC కూడా పెట్టుబడిదార్ల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నివేదిక ఒక అంటువ్యాధిలా వ్యాపించి, మొత్తం మార్కెట్‌పైనా ప్రభావాన్ని చూపింది.