Adani Group Debt: హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ తర్వాత, అదానీ గ్రూప్ తన అప్పులను సాధ్యమైనంత మేర తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా, 130 మిలియన్ డాలర్ల రుణాన్ని త్వరలో చెల్లిస్తామని అదానీ పోర్ట్స్‌ & స్పెషల్ ఎకనమిక్ జోన్ (Adani Ports and Special Economic Zone) ప్రకటించింది. మొత్తం 413 మిలియన్‌ డాలర్ల రుణాన్ని గడువుకు ముందే చెల్లిస్తామని గతంలో అదానీ గ్రూప్‌ వెల్లడించింది.


అదానీ పోర్ట్స్‌, 3.375 శాతం కూపన్‌ రేట్‌తో, 2024లో మెచ్యూర్ అయ్యే 130 మిలియన్ డాలర్ల విలువైన డాలర్‌ డినామినేషన్‌ బాండ్లను గత నెల చివరిలో జారీ చేసింది.     


130 మిలియన్‌ డాలర్ల టెండర్‌ విజయవంతమైన తర్వాత, 520,000,000 డాలర్ల బాకీ ఉంటుందని అదానీ పోర్ట్ గత నెలలో తెలిపింది. ఈ టెండర్ తర్వాత, రాబోయే నాలుగు త్రైమాసికాల్లో, తనఖాలో ఉన్న దాదాపు 130,000,000 షేర్లను విడిపించుకునేందుకు ఒక ఆఫర్‌ ప్రకటించాలని అదానీ పోర్ట్స్‌ భావిస్తోంది.      


కంపెనీ ప్రణాళిక ఇది            
రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని, పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అదానీ అదానీ పోర్ట్స్‌ & సెజ్‌ భావిస్తోంది. తద్వారా, అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనన్న భరోసా కల్పించాలని అనుకుంటోంది.


ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) నివేదిక వెలువడిన తర్వాత, అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ స్టాక్‌ల మార్కెట్ విలువ సుమారు 114 బిలియన్‌ డాలర్లు తగ్గింది. బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) గ్రూప్‌ కంపెనీలు మోసం, స్టాక్ మానిప్యులేషన్, ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తన నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్‌ ఖండించింది.


అదానీ స్టాక్స్‌లో ట్రేడింగ్‌             
అదానీ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్ స్టాక్‌లలో 7, ఇవాళ (మంగళవారం, 09 మే 2023) ప్రారంభ సెషన్‌లో బలమైన నోట్‌తో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 1.45% లాభంతో ట్రేడవుతున్నాయి. అదానీ పవర్ 0.84 శాతం, అంబుజా సిమెంట్ 0.79 శాతం, అదానీ పోర్ట్స్ 0.72 శాతం బలపడ్డాయి. NDTV 0.28 శాతం లాభంతో ట్రేడవుతుండగా, అదానీ విల్మార్ 0.24 శాతం, ACC 0.41% లాభంతో ట్రేడవుతున్నాయి.


అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 2.93% క్షీణించాయి. అదానీ టోటల్ గ్యాస్ -0.68%, అదానీ గ్రీన్ -0.41% నష్టంలో ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.