Adani Group Stocks Crash: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన షాకింగ్‌ రిపోర్ట్‌తో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ మట్టి కరిచాయి. 


ఇవాళ (శుక్రవారం, 27 జనవరి 2023) మారెట్‌లో కూడా అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ స్టాక్స్ 19 శాతం వరకు క్షీణించాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్లను షార్ట్‌ చేసిన నేపథ్యంలో, ఆ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పయనం మొదలు పెట్టాయి. 85 శాతం ఓవర్‌ వాల్యుయేషన్ నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ వరకు అనేక సందేహాలను తన రిపోర్ట్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రస్తావించింది. ముఖ్యంగా, గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) గత 8 సంవత్సరాల కాలంలో 5 మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చిందని, ఇది అకౌంటింగ్ సమస్యలను సూచించే కీలక రెడ్ ఫ్లాగ్ అని ఆ కంపెనీ పేర్కొంది.


19 శాతం వరకు పడిపోయిన స్టాక్స్ 
మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ 19 శాతం పడిపోయింది. ఈ షేరు బుధవారం రూ. 2517 వద్ద ముగిసింది, ఇవాళ మార్కెట్ ప్రారంభమైన తర్వాత ఒక్కో షేరు రూ. 482 మేర పడిపోయింది. ప్రస్తుతం 13.22 శాతం పతనంతో రూ. 2177 వద్ద ట్రేడవుతోంది. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్‌లో కూడా భారీ క్షీణత కనిపించింది. ఈ స్క్రిప్‌ చివరి ముగింపు రూ. 3660 నుంచి ప్రస్తుతం రూ. 2963కి పడిపోయింది. దాదాపు రూ. 700 లేదా 19 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుతం ఈ షేరు 13.66 శాతం పతనంతో రూ. 3147 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ మునుపటి ముగింపు స్థాయి రూ. 1857 నుంచి రూ. 15.77 శాతం క్షీణించి రూ. 293కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 7.74 శాతం పతనంతో రూ.1714 వద్ద ట్రేడవుతోంది.


లోయర్ సర్క్యూట్‌లో రెండు స్టాక్స్‌
అదానీ గ్రూప్‌లోని ఇతర స్టాక్స్‌లో అదానీ పవర్, అదానీ విల్మార్ కూడా 5 శాతం క్షీణించాయి, ఈ రెండు స్టాక్స్‌ లోయర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. బుధవారం రూ. 713 వద్ద ముగిసిన అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్‌ స్టాక్, శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే రూ. 675కి పడిపోయింది, ప్రస్తుతం ఈ షేరు 2.63 శాతం క్షీణించి రూ. 695 వద్ద ట్రేడవుతోంది.


FPO ప్రారంభం రోజున భారీ పతనం
నేటి నుంచి నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ ఆఫర్ (FPO) ప్రారంభం కాగా.. అదే రోజు ఈ స్టాక్‌లో భారీ పతనం చవి చూసింది. చివరి ముగింపు స్థాయి రూ. 3388 నుంచి ఈ షేరు 6.13 శాతం పతనమై రూ. 3180 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 2.25 శాతం నష్టంతో రూ. 3312 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్‌ ధర ఇప్పుడు FPO ప్రైస్ బ్యాండ్ (రూ. 3,112- 3,276) స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.