గుజరాత్ కు చెందిన గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు వెళ్లింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి ఇక అదానీ గ్రూప్ చూసుకోనుంది.


ఇంతవరకూ ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్వహించిన కంపెనీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్), జీవీకే గ్రూపులో భాగంగా ఉండేది. ఈ కంపెనీనిని జీవీకే గ్రూప్ నుంచి కొంతకాలం క్రితం అదానీ ఎయిర్ పోర్ట్ హోల్టింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్ ఎల్) సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన లావాదేవీలు పూర్తికావటంతో, ముంబయి విమానాశ్రయం బాధ్యతలను అదానీ గ్రూపు చేపట్టింది.


జీవీకే గ్రూప్ నుంచి యాజమాన్య బాధ్యతలు అదానీ గ్రూప్ కు మారడంపై గౌతమ్ అదానీ ప్రకటన చేశారు. ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రక్రియలో స్థానికులు వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.


మరో మూడేళ్లలో అంటే 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో సివిల్ ఏవియేషన్ మార్కెట్ గా భారత్ అవతరించబోతున్నదని అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏవియేషన్ రంగంలో అవకాశాలను అదానీ గ్రూపు అందిపుచ్చుకుంటుందని ఆయన అన్నారు. 2024 నాటికి నవీ ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. 


దేశంలో నం.1గా..


ముంబయి విమానాశ్రయం దక్కడంతో అదానీ గ్రూప్ జోష్ లో ఉంది. విమానాశ్రయ రంగంలో దూసుకెళ్తుంది. అయితే విమానాశ్రయ రంగంలో ఎక్కువ శాతం వాటా అదానీ గ్రూప్ కు దక్కడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగువారైన జీవీ కృష్ణా రెడ్డికి చెందిన జీవీకే గ్రూపు నుంచి తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ ను దక్కించుకోవడం వల్ల ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. కేంద్రం ప్రభుత్వం.. ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.



  • ప్రస్తుతం మెట్రో నగరాల్లోని ఎయిర్ పోర్టులపైనే కాకుండా, దేశంలోని టైర్ 2, 3 సిటీల్లోనూ ఏవియేషన్ సేవల విస్తరణకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుంది.

  • జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గువాహటి సహా 6 ఎయిర్ పోర్టుల నిర్వహణకు ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

  • ప్రస్తుతం దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25 శాతానికి చేరింది.

  • దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టు సంస్థగా అవతరించింది.

  • ఇండియన్ ఎయిర్ కార్గోలో అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ 33 శాతం మార్కెట్ వాటానూ సొంతం చేసుకుంది.