Adani Group Plans For 84 Billion Dollar Investment: దేశంలో రెండో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ (Adani Group) ఓనర్‌, వ్యాపార విస్తరణ విషయంలో దూకుడుగా ఉండే గౌతమ్ అదానీ... తన గ్రూప్‌ బిజినెస్‌ పెంచుకోవడానికి మరో మెగా ప్లాన్‌ వేశారు. దేశంలోని మౌలిక సదుపాయాల (infrastructure) రంగంలో 7 లక్షల కోట్ల రూపాయల ( 84 బిలియన్ డాలర్లు‌) పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్‌ యోచిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ మొత్తాన్ని ఇన్‌ఫ్రా సెక్టార్‌లోకి అదానీ గ్రూప్‌ పంప్‌ చేస్తుంది. 


బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్‌ ప్లాన్ చేస్తున్నట్లు ఆ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ చెప్పారు. అయితే, అంతకుమించి చెప్పడానికి నిరాకరించారు.


ఈ ఏడాది కాలంలో జరిగిన విషయాలు ఇవీ..
ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి 2023) అదానీ గ్రూప్‌పై పిడుగు లాంటి దెబ్బ పడింది. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research), అదానీ గ్రూప్‌ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. ఆ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు పాతాళానికి పతనం అయ్యాయి. ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినా, గ్రూప్‌ షేర్లలో నష్టాన్ని ఆపలేకపోయింది. అదానీ గ్రూప్ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది, గ్రూప్‌లోని లిస్టెడ్ స్టాక్‌ల మార్కెట్ విలువ భారీగా క్షీణించింది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ‍‌(Adani Enterprises), తన FPOను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గ్రూప్ ఇమేజ్‌ దెబ్బతిన్నాక వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు, అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేసింది.


హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. దీనిపై విచారణ జరపాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సెబీ, తన దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది. విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. విచారణ పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని సెబీ కోర్టుకు తెలిపింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, నవంబర్ 28, 2023న (మంగళవారం) అదానీ గ్రూప్ షేర్లలో భారీ ర్యాలీ కనిపించింది. అదానీ గ్రూప్‌ మార్కెట్ క్యాప్‌ (Adani Group Market Capitalization) ఒక్క రోజులో రూ. 1 లక్ష కోట్లకు పైగా పెరిగింది. జనవరి 2023 తర్వాత ఒక్క రోజులో పెరిగిన అత్యధిక విలువ ఇది.


2023 జులైలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ... పోర్ట్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా బిజినెస్‌లను భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల, శ్రీలంకలో అదానీ గ్రూప్ చేపట్టిన పోర్ట్ ప్రాజెక్ట్ కోసం 'US ప్రభుత్వ అభివృద్ధి సంస్థ' ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇది, అదానీ గ్రూప్‌నకు అతి పెద్ద ఉపశమనం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి