Adani Stocks Crash: అదానీ గ్రూప్ స్టాక్స్‌లో గత వారం పతనం ఈ వారంలోనూ కొనసాగుతోంది. వారం మొదటి రోజున (సోమవారం, 13 ఫిబ్రవరి 2023) కూడా అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్షీణత నమోదైంది.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన మొత్తం 10 అదానీ కంపెనీల్లో 6 కంపెనీ స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లి పోయాయి. అదే సమయంలో, మిగిలిన నాలుగు కౌంటర్లు కూడా నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి.
అదానీ షేర్ల ధరలు ఆవిరి
అదానీ గ్రూప్ స్టాక్స్‌ను పరిశీలిస్తే... అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) స్టాక్ 10 శాతం పడిపోయి రూ. 1662 ఇంట్రా డే కనిష్టాన్ని నమోదు చేసింది, ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) 5 శాతం క్షీణించి రూ. 688 వద్ద, అదానీ విల్మార్ (Adani Wilmar) 5% క్షీణించి రూ. 414 వద్ద, అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) 5% తగ్గి రూ. 1127 వద్ద, అదానీ పవర్ (Adani Power) 5% పడిపోయి రూ. 156 వద్ద, అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) 5% తగ్గి రూ. 1192 వద్ద, ఎన్‌డీటీవీ (NDTV) 5% కోల్పోయి రూ. 198 వద్ద లోయర్ సర్క్యూట్స్‌లో లాక్ అయ్యాయి.
మిగిలిన స్టాక్స్‌లో... అదానీ పోర్ట్స్ & సెజ్ (Adani Ports & Special Economic Zone) 8% శాతం పైగా దిగి వచ్చి రూ. రూ. 537 వద్ద, ఏసీసీ (ACC) దాదాపు 5% తగ్గి రూ. 1,798 వద్ద, అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) దాదాపు 7% క్షీణించి రూ. 337 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు చేరుకున్నాయి, ప్రాఫిట్ బుకింగ్స్ కారణంగా అతి స్వల్పంగా కోలుకున్నాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ ఎందుకు పడిపోయాయి?
ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, అదానీ గ్రూప్ కంపెనీల క్రెడిట్ ఔట్‌లుక్ తగ్గించింది. ఈ గ్రూప్ బాండ్ పోర్ట్‌ఫోలియోలో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ మీద విపరీతమైన ఒత్తిడి కనిపించింది. దీనికి తోడు, అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని, గ్రూప్ మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం కూడా మార్కెట్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అదానీ గ్రూప్, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 40 శాతంగా పెట్టుకున్న లక్ష్యాన్ని తాజాగా 15-20 శాతానికి తగ్గించింది. కంపెనీల విస్తరణ ప్రణాళికపై అయ్యే వ్యయాన్ని తగ్గించి, గ్రూప్‌ని ఆర్థికంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.