Hindenburg - Adani Group: అదానీ గ్రూప్ షేర్లు ఈ రోజు (సోమవారం, 13 ఫిబ్రవరి 2023) మళ్లీ క్షీణించాయి. ఉదయం 11.38 గంటల సమయానికి, గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేర్ ధర 3.22% పడిపోయి, రూ. 1,787 వద్ద ఉంది. అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ పవర్ (Adani Power), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) షేర్ ధరలు 5 శాతం క్షీణించి, లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.
ఆదాయ వృద్ధి లక్ష్యానికి అడ్డకోత
ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అదానీ గ్రూప్ (Adani Group) ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తన ఆదాయ వృద్ధి (revenue growth) లక్ష్యాన్ని ఈ గ్రూప్ ఏకంగా సగానికి సగం అడ్డంగా కోసేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 40 శాతం లక్ష్యం సాధించాలని అదానీ గ్రూప్ గతంలో భావిస్తే, ఇప్పుడు దానిని 15-20 శాతానికి పరిమితం చేసింది.
క్యాపాక్స్ ప్లాన్‌లోనూ కటింగ్
దీంతో పాటు.. గ్రూప్ చేపట్టే కొత్త మూలధన వ్యయాలు (Capital expenditure) లేదా కొత్త పెట్టుబడులను కూడా నెమ్మదింపజేస్తోంది. భారీ స్థాయి పెట్టుబడులతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపాలని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రాక ముందు వరకు గౌతమ్ అదానీ భావించారు. మార్కెట్ మైండ్ బ్లాంక్ చేసే పెట్టుబడులతో, గ్రూప్ కంపెనీల సంపదను ఎవరూ ఊహించని రీతిలో పెంచాలని భావించారు. ఇప్పుడు, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్లాన్స్‌ను అదానీ వాయిదా వేశారు. దూకుడుగా విస్తరించే బదులు, గ్రూప్ కంపెనీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి సారించాలని అదానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నెలల పాటు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఆపితే, గ్రూప్‌లోని అన్ని కంపెనీల వద్ద 3 బిలియన్ డాలర్ల వరకు డబ్బు ఆదా అవుతుందట. ఆ డబ్బును రుణాన్ని తిరిగి చెల్లించడానికి లేదా నగదు నిల్వను పెంచడానికి ఉపయోగించుకోచ్చని సమాచారం.
గ్రూప్ ప్రణాళికలు ఇంకా సమీక్షలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరారు చేస్తారని తెలుస్తోంది.
2023 జనవరి 24న, అమెరికాకు చెందిన రీసెర్చ్ అండ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన ఘాటైన నివేదిక తర్వాత అష్టకష్టాలు చుట్టుముట్టిన నేపథ్యంలో, వాటి నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికన్ షార్ట్ సెల్లర్ చేసిన అకౌంటింగ్ మోసం & స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ, అదానీ సామ్రాజ్యం మార్కెట్ విలువ నుంచి సుమారు 120 బిలియన్ డాలర్లు తుడిచి పెట్టుకుపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.