Adani Enterprises: రూ.7,374 కోట్ల రుణాన్ని ముందుస్తుగానే చెల్లించామని ప్రకటించుకున్న అదానీ గ్రూప్, ఒక్కరోజు కూడా తిరక్క ముందే మరిన్ని షేర్లను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. తీసుకున్న రుణాలకు సెక్యూరిటీగా, గ్రూప్‌లోని రెండు కంపెనీల షేర్లను తనఖాకు పంపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) చెందిన ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీ (SBICAP Trustee) ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు (Adani Enterprises) అప్పులు ఇచ్చిన వాళ్ల ప్రయోజనం కోసం, అదానీ గ్రీన్ ఎనర్జీకి (Adani green Energy) చెందిన 0.99 శాతం షేర్లను, అదానీ ట్రాన్స్‌మిషన్‌కు (Adani Transmission) చెందిన 0.76% వాటాను బ్యాంకుల వద్ద ప్లెడ్జ్ చేసినట్లు ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీ వెల్లడించింది. ఇప్పటికే బ్యాంకులకు కుదవబెట్టిన ఉన్న షేర్లకు అదనంగా, ఈ షేర్లను అదానీ గ్రూప్ తాకట్టు పెట్టింది.
అయితే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ తీసుకున్న రుణ పరిమాణం, ఏ రుణాల కోసం ఇప్పుడు ఈ షేర్లను ప్లెడ్జ్ చేసిందీ ఎస్‌బీఐక్యాప్ వెల్లడించలేదు. అదనపు తాకట్టుతో కలిపి, అదానీ గ్రీన్ ఎనర్జీలో దాదాపు 2%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో దాదాపు 1.32% వాటా ఇప్పుడు ఎస్‌బీఐక్యాప్ వద్దకు తాకట్టు కోసం వచ్చాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల పతనం
షేర్ల తాకట్టు వార్తతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర భారీగా పతనమైంది. ఇవాళ (శుక్రవారం, 10 మార్చి 2023) మార్కెట్ ప్రారంభంలోనే దాదాపు 5% గ్యాప్ డౌన్‌తో స్టాక్ ప్రైస్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా పతనం కొనసాగింది. ఉదయం 9.30 గంటల సమయానికి, ఒక్కో షేరు 5.44% లేదా రూ. 106 నష్టంతో రూ. 1,846.90 వద్ద ఉన్నాయి.
గ్రూప్ రుణాలపై పెట్టుబడిదారుల్లో ఉన్న ఆందోళనలను పొగొట్టడానికి రూ. 7,374 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించినట్లు 2023 మార్చి 7న అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 31 మిలియన్లు లేదా 4% తాకట్టు షేర్లు, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 155 మిలియన్లు లేదా 11.5%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 36 మిలియన్లు లేదా 4.5%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.2% షేర్లను రుణ చెల్లింపుల తర్వాత వెనక్కు తీసుకున్నామని వెల్లడించింది. ఈ ముందస్తు చెల్లింపులతో, షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు $ 2.016 బిలియన్ల రుణాన్ని తిరిగి చెల్లించినట్లు తెలిపింది.
రుణాలు తిరిగి చెల్లించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అదానీ గ్రూప్ చెప్పలేదు. అయితే, ఇటీవల, గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్లను జీక్యూజీ పార్టనర్స్‌కు ప్రమోటర్ ఎంటిటీ విక్రయించింది, తద్వారా రూ. 15,446 కోట్లు సమీకరించింది. ఈ డబ్బు నుంచే రుణాల్లో కొంత భాగాన్ని ముందస్తుగా అదానీ గ్రూప్ చెల్లించినట్లు మార్కెట్ భావిస్తోంది. గత నాలుగేళ్లలో అదానీ గ్రూప్‌పై ఉన్న బకాయిలు రెట్టింపు అయ్యాయి. గత నెలలో పెట్టుబడిదార్లతో పంచుకున్న సమాచారం ప్రకారం, అదానీ గ్రూప్ రుణాలు 2019లోని రూ. 1.11 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 2.21 లక్షల కోట్లకు పెరిగాయి. 2024లో ఈ గ్రూప్ $ 2 బిలియన్ల ఫారిన్ కరెన్సీ బాండ్లను చెల్లించవలసి ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.