Adani Group - Hindenburg Case: అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో, స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీకి (SEBI) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 6 నెలలు సమయం కావాలంటూ సెబీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిని పిటిషనర్‌ వ్యతిరేకించారు. దర్యాప్తు చేసేందుకు రెగ్యులేటర్‌కు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని కోర్టు పేర్కొంది.


పిటిషనర్ విశాల్ తివారీ, ఈ నెల 2వ తేదీన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు కాల గడువును పొడిగించడం వల్ల కేసు విచారణ ఆలస్యం అవుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొంటూ, సెబీ విచారణకు మరింత సమయం ఇవ్వొద్దని కోరారు. 


స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, గత వారం, సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌లో ఉన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తమకు మరో ఆరు నెలల సమయం కావాలని కోరింది.


గతంలో రెండు నెలల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
అంతకుముందు, ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగిన విచారణలో, హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది, రెండు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆప్పట్లో నిర్దేశించింది. అయితే, విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని అత్యున్నత న్యాయస్థానానాన్ని సెబీ కోరుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రకారం 12 అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపేందుకు 15 నెలల సమయం పడుతుందని సెబీ కోర్టుకు వెల్లడించింది. ఆ లావాదేవీలు చాలా క్లిష్టమైనవని, అలాగే అనేక ఉప లావాదేవీలు కూడా అందులో ఉన్నాయని వివరించింది. సెబీ చెప్పిన ప్రకారం, కూలంకషంగా దర్యాప్తు చేయడానికి అనేక దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్‌లు అవసరం. 10 సంవత్సరాల కంటే పాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు కూడా ఇందుకు అవసరం. అవి పొందడానికి సమయం పడుతుంది, పైగా ఇది సవాలుతో కూడుకున్న పని. కాబట్టి, మరో ఆరు నెలలు గడువు ఇస్తే విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని న్యాయస్థానానికి సెబీ తెలిపింది.


అదానీ కేసు తెరపైకి వచ్చిన తర్వాత, 2023 మార్చి 2న, మార్కెట్‌ నియంత్రణ నిబంధనలను పటిష్టం చేయడంపై సిఫార్సులను అందించడానికి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం సప్రే అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని కూడా అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును ఆ కమిటీతో పంచుకున్నామని సెబీ కోర్టుకు తెలిపింది.


తగిన సమయం ఇచ్చామన్న సుప్రీంకోర్టు
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మరో ఆరు నెలల గడువు కోరుతూ దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అదానీ గ్రూపునకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించేందుకు, స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సెబీకి తగిన సమయం ఇచ్చిందని పేర్కొంది.


అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ బ్లాస్టింగ్‌ నివేదిక, తదనంతర పరిణామాల తర్వాత... సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విశాల్ తివారీ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. రెండో పిటిషన్‌ను కాంగ్రెస్‌ నాయకుడు జయ ఠాకూర్‌, మూడో పిటిషన్‌ను ఎంఎల్‌ శర్మ దాఖలు చేశారు.