Adani Enterprises: అదానీ గ్రూప్‌ కంపెనీల అధిపతి గౌతమ్‌ అదానీని కష్టాలు ఒక దాని తర్వాత మరొకటి వెంటాడుతున్నాయి. 2023 జనవరి 24వ తేదీన ఓ ముహూర్తాన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ (Hindenburg) రిపోర్ట్ బయటకు వచ్చిందో గానీ, అప్పట్నుంచి అదానీ అష్టదిగ్భంధంలో చిక్కుకున్నారు. ఇబ్బందులన్నీ అదానీపై మూకదాడి చేశాయి, చేస్తున్నాయి. 


అదానీ గ్రూప్ కంపెనీలు అనైతిక చర్యలకు, అక్రమాలకు పాల్పడినట్లు తన నివేదికలో హిండెన్‌బర్గ్ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో, నిఫ్టీ50 స్టాక్‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను (Adani Enterprises) డో జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ (Dow Jones Sustainability Indices) నుంచి తొలగించనున్నారు. దీంతో, అదానీ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిసింది. 


"అకౌంటింగ్‌లో మోసం ఆరోపణల కారణంతో వెలువడిన మీడియా & వాటాదార్ల రిపోర్ట్‌ల తర్వాత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ డో జోన్స్ సస్టైనబిలిటీ సూచిక నుంచి తీసివేస్తాం" అని డో జోన్స్ ప్రకటించింది. 


2023 ఫిబ్రవరి 7న మార్కెట్‌ ప్రారంభానికి ముందే డో జోన్స్ సస్టైనబిలిటీ సూచీలో మార్పులు అమల్లోకి వస్తాయని తన ప్రకటనలో డో జోన్స్‌ పేర్కొంది.


డో జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్‌లు అంటే ఏంటి?
కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (CSA) ద్వారా S&P గ్లోబల్ (S&P Global) సెలెక్ట్‌ చేసిన కంపెనీల పనితీరును కొలిచే క్యాపిటలైజేషన్ వెయిటెడ్ సూచీలు డో జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్‌. ESG (ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌, గవర్నెన్స్ & ఎకనామిక్) ప్రమాణాలను పాటించే ప్రపంచ స్థాయి కంపెనీలను S&P గ్లోబల్ ఈ సూచీలోకి ఎంచుకుంటుంది. S&P గ్లోబల్ BMIలోని (Broad Market Index) టాప్‌ 2,500 కంపెనీల్లో టాప్ 10%కి డో జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ ప్రాతినిధ్యం వహిస్తుంది.


ఇవాళ (శుక్రవారం, 03 ఫిబ్రవరి 2023) ఉదయం 10.50 గంటల సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర ఏకంగా 32% నష్టపోయి రూ. 1,017.45 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరింది. గత 5 ట్రేడింగ్‌ రోజుల్లోనే ఈ స్టాక్‌ 64% పతనమైంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కటే కాకు, అదానీ గ్రూప్‌ స్టాక్స్ అన్నీ ప్రస్తుతం ఫ్రీఫాల్‌లో ఉన్నాయి. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ గత వారం ఆరోపణలు చేసినప్పటి నుంచి పెట్టుబడిదార్ల సంపద 40% పైగా క్షీణించింది.


రంగంలోకి దిగిన NSE, SEBI, RBI
అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌లోని తీవ్ర అస్థిరత నుంచి పెట్టుబడిదార్లను రక్షించే ఉద్దేశ్యంతో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అంబుజా సిమెంట్స్‌ను స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల (ASM) ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకు వచ్చింది.


అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల క్రాష్‌ నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ FPOలోనూ ఏవైనా అవకతవకలు జరిగాయా అని సెబీ (SEBI) కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


అదానీ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించి పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకులకు సూచించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన హై లీవరేజ్డ్‌ (ఎక్కువ మార్జిన్‌) రుణాల మీద ఆర్‌బీఐ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.