Adani Enterprises Q3 Results: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తిరిగి లాభాల బాట పట్టింది. 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 820 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ‍‌(Adani Enterprises net profit) ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో (2021 డిసెంబర్‌ త్రైమాసికంలో) ఈ కంపెనీ రూ. 11.63 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ నష్టాల నుంచి తిప్పుకుని, తిరిగి లాభాల్లోకి ఎంటరైంది.


కార్యకలాపాల ఆదాయం ‍‌(Revenue from Operations) ఏడాదికి ‍‌దాదాపు 42% (YoY) పెరిగి రూ. 26,612.23 కోట్లకు చేరుకుంది.


ఏకీకృత నిర్వహణ లాభం లేదా ఎబిటా (EBITDA) గత ఏడాది కంటే రెండింతలు పెరిగి రూ. 1,968 కోట్లకు చేరుకుందని Q3FY23 రిపోర్ట్‌లో కంపెనీ తెలిపింది.


“ప్రస్తుత మార్కెట్ అస్థిరత తాత్కాలికం. దీర్ఘకాలిక విలువలను సృష్టించడంపై దృష్టి పెట్టిన క్లాసికల్ ఇంక్యుబేటర్‌గా AEL (అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌) పని చేస్తుంది. మితమైన అప్పులు & విస్తరించడానికి, వృద్ధి చెందడానికి వ్యూహాత్మక అవకాశాలు అనే జంట లక్ష్యాలతో ఈ కంపెనీ పని చేస్తూనే ఉంటుంది” అని అదానీ గ్రూప్‌ చైర్మన్ గౌతమ్ అదానీ ‍‌(Adani Group Chairman Gautam Adani) చెప్పారు.


అన్ని విభాగాల్లోనూ జంప్‌
2022 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలానికి సమీకృత వనరుల నిర్వహణ వ్యాపార ఆదాయంలో 38% YoY వృద్ధిని సాధించిన ఈ కంపెనీ, రూ. 17,595 కోట్లను నివేదించింది. ఇదే కాలంలో, మైనింగ్ వ్యాపార విక్రయాలు దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 2,044 కోట్లకు చేరుకున్నాయి.


న్యూ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ బిజినెస్‌ వ్యాపార ఆదాయం కూడా డిసెంబర్‌ త్రైమాసికంలో రెండింతలు పెరిగి రూ. 1,427.40 కోట్లకు చేరుకుంది. విమానాశ్రయాల వ్యాపారం రెట్టింపు ఆదాయంతో రూ. 1,733 కోట్లకు చేరుకుంది.


న్యూ ఎనర్జీ విభాగంలో, కంపెనీ సోలార్ మాడ్యూల్స్ వాల్యూమ్ 63% పెరిగి 430 మెగావాట్లకు చేరుకుంది. మైనింగ్ వ్యాపారంలో, ఉత్పత్తి పరిమాణం 6.2 మిలియన్ టన్నులుగా ఉంది.


మూడో త్రైమాసికంలో ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వ్యాపార పరిమాణం సంవత్సరానికి 8% పెరిగి 15.8 మిలియన్ టన్నులకు చేరుకుంది. భారతదేశంలో నంబర్ వన్ ప్లేయర్‌గా నాయకత్వ స్థానాన్ని ఈ విభాగం కొనసాగించింది.


ఆస్ట్రేలియాలోని కార్మైకేల్ గని Q3లో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది, Q2లోని 1.9 మిలియన్ టన్నుల నుంచి ఇది పెరిగింది.


ఒక్కసారిగా పెరిగిన షేర్‌ ధర
మధ్యాహ్నం 2 గంటల వరకు నష్టాల్లో ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర, డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత సడెన్‌గా హై జంప్‌ చేసింది. దాదాపు 7 శాతం లాభంతో రూ. 1,889 వద్ద ఇంట్రా-డే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 2.45 గంటల సమయానికి ఈ స్టాక్‌ 3.55 శాతం లాభంతో రూ. 1,782 వద్ద ఉంది.


2023 సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ కౌంటర్‌ దాదాపు 54 శాతం లేదా ఒక్కో షేరుకు రూ. 2,046 చొప్పున నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.