5G Spectrum Auction: అదానీ గ్రూప్ టెలికాం రంగంలోకి ప్రవేశించడం ఖాయమే! 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆ కంపెనీ పాల్గొంటోందని స్పష్టమైంది. అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ నుంచి దరఖాస్తులు అందాయని టెలికాం శాఖ తెలిపింది. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz and 26 GHz బ్యాండ్స్ హక్కులను దక్కించుకొనేందుకు వీరు పోటీపడతారని వెల్లడించింది.
ప్రస్తుతం వెల్లడించిన జాబితా కేవలం సమాచారం కోసమేనని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ దరఖాస్తులను ఆమోదించినట్టు, ముందుగానే అర్హత సాధించినట్టు భావించొద్దని పేర్కొంది. జులై 26న 5జీ వేలం నిర్వహిస్తామని తెలిపింది. వేలం విజేతలు 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. వేలంలో రూ4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 MHz స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రతిపాదనల మేరకు 5జీ వేలం రిజర్వు ధరలకు కేంద్ర మంత్రివర్గం గత నెల్లో ఆమోదం తెలిపింది. బిడ్డర్లను ఆకర్షించేందుకు చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. గెలిచిన బిడ్డర్లు ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. ఏటా ఆరంభంలో 20 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఖర్చుల భారం తగ్గించేందుకు, వ్యాపారం సజావుగా సాగేందుకు, నగదు ప్రవాహం ఉండేందుకు ఇలా చేసినట్టు తెలిసింది.
స్పెక్ట్రమ్ వేలం
అదానీ గ్రూప్ రాకతో స్పెక్ట్రమ్ వేలం పోటీ మరింత పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 'ప్రైవేటు నెట్‌వర్క్ సొల్యూషన్స్ అందించేందుకు మేం 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నాం. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఇతర తయారీ కార్యకలాపాల్లో సైబర్ సెక్యూరిటీ సేవలు అందించనున్నాం' అని అదానీ గ్రూప్ గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ప్రైవేటు నెట్‌వర్క్ సేవలు అందిస్తామని చెప్పినా మున్ముందు కన్జూమర్ మొబిలిటీ విభాగంలోకీ అదానీ గ్రూప్ వచ్చే అవకాశం లేకపోలేదని గోల్డ్‌మన్ సాచెస్ అంచనా వేసింది. వేలంలో స్పెక్ట్రమ్ ధరలు పెరుగుతాయని తెలిపింది.
Also Read: మళ్లీ 53 వేల దిగువకు సెన్సెక్స్! 157 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Also Read: అవే నష్టాలు.. అవే కష్టాలు! తగ్గిన బిట్‌కాయిన్ ధర